రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మారిన నేతలపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు ముందు పార్టీ మారి… విమర్శలు చేసిన వారిపై చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డి, కొండా మురళిలపై ఆగ్రహాం ఉన్న టీఆర్ఎస్ పార్టీ… వారిపై చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే కొండామురళి తన పదవికి రాజీనామా చేయడంతో మరో ముగ్గురు ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ నోటీసులు అందించారు. ఈ నోటీసులపై వాదనలు పూర్తయ్యాయి. గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీ రాములు నాయక్ అనర్హత వేటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
ఇప్పటికే ఇరువర్గాల వాదనలు పూర్తయైనా… తన నిర్ణయాన్ని మాత్రం మండలి చైర్మన్ స్వామిగౌడ్ రిజర్వ్ లో ఉంచారు. యాదవరెడ్డి, భూపతిరెడ్డిలపై వేటుకు రంగం సిద్దం చేశారు. రెండు మూడు రోజులు సంక్రాంతి సెలవులు రావడంతో నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండటంతో ఆ లోపే ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని వాదనలు ముగిసినందున ఛైర్మన్ నిర్ణయం కోసం గులాబీ పార్టీ ఎదురుచూస్తోంది. అయితే ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవరెడ్డి మాత్రం తాము పార్టీ మారలేదని… పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని కౌన్సిల్ చైర్మన్‌కు తమ వాదన వివరించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి సోనియా గాంధీ రావడంతో తాను కృతజ్ఞతలు తెలిపేందుకే మేడ్చల్ సభలో కలిసినట్లు యాదవరెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక మరో ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మళ్లీ టిఆర్ఎస్ కు వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ఆ పార్టీ నేతలకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. అయితే నిజామాద్ జిల్లా నేతలను కలవమని సదరు నేతలు భూపతిరెడ్డికి సూచన చేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరిన భూపతిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ చేర్చుకునే అవకాశం లేదన్న చర్చ గులాబీ ఎమ్మెల్సీల్లో జరుగుతోంది.