ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో హైదరాబాద్ లో మీటింగ్ పెడజుతున్నారు. ఎలాగైనా తెలంగాణలో ప్రభావం చూపాలని కనీసం ఇరవై సీట్లలో అయినా గెలిచి హంగ్‌లో కింగ్ అవ్వాలని అనుకుంటోంది. బీసీ సీఎం నినాదం అందుకోసమే. ఇప్పుడు ఏకంగా తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించాలని అనుకుంటున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బండి సంజయ్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
బండి సంజయ్ ను బీజేపీ చీఫ్ గా తప్పించడం పార్టీకి చాలా డ్యామేజ్ అయింది. అయితే ఆయనను తప్పించడం వెనుక కుట్రలేమీ లేవని.. బీ సీ వర్గాలకు అత్యంత ప్రా ధాన్యత ఇస్తామని చెప్పుకునేందుకు ఆయనకు కీలక పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా హెలికాప్టర్ కూడా ప్రచారానికి కేటాయించారు. ఆయనను మాస్ లీడర్ గా గుర్తిస్తున్నామని చెప్పకనే చెబుతున్నారు. బీసీని సీఎంను చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆయననే అభ్యర్థిని చేస్తామని మోదీ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు బండి సంజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే బీసీలు ఏకపక్షంగా మద్దతు పలుకుతారన్న భావనలో హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో పొత్తు కలసి వస్తుందని అంచనాల్లో ఉన్నారు. ప్రధాని మోదీ హాజరు కాబోయే బీసీ ఆత్మగౌరవ సభ కు పవన్ కల్యాణ్ కూడా హాజరవుతున్నారు .
బీజేపీ హైకమాండ్ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించాలనే ఆలోచన చేయదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆ పార్టీ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా .. రాష్ట్రాల వారీగా వ్యూహాలు మార్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో విజయం కోసం పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.