కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ భాజపాకి గుబులు పెరుగుతోందని చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో మతం కార్డుతో గట్టెక్కొచ్చు, లింగాయత్ లను ఆకర్షించి అధికారంలోకి రావొచ్చు అనే భరోసా భాజపాకి రోజురోజుకీ తగ్గుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెర్సెస్ ఎడ్యూరప్ప మధ్యే పోరాటం ఉంటుందని అనుకున్నాం. ఈ ఇద్దరు నేతలే ఎన్నికల ప్రచారానికి ఆయా పార్టీల తరఫున హోరెత్తిస్తారనుకున్నాం. కానీ, ఇప్పుడు భాజపా తరఫున ప్రచారం చేసేందుకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమౌతున్నట్టు సమాచారం. ఒకటో రెండో సభలకు పరిమితం కాకుండా.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ కర్ణాటక ప్రచారంపైనే పూర్తి శ్రద్ధ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఏ మారుమూల ఎన్నికలు ఉన్నాయన్నా భాజపా తరఫు ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ ప్రచారానికి వెళ్లిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ, కర్ణాటక విషయంలో ఆయనే మరింత శ్రద్ధ తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారంటే… ఎడ్యూరప్పను నమ్ముకుంటే పార్టీ ఓటమిపాలయ్యే అవకాశాలున్నాయనేది భాజపా అంతర్గత వర్గాల విశ్లేషణగా తెలుస్తోంది. నిజానికి, లింగాయత్ కమ్యూనిటీ ఓటర్లను ఆకర్షించడం కోసమే ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా భాజపా రంగంలోకి దింపుతూ వస్తోంది. కానీ, ఇప్పుడా ఓట్లు పెద్ద సంఖ్యలో చీలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. లింగాయత్ ను ప్రత్యేక మతంగా గుర్తించి, వారి ప్రయోజనాల కోసం సిద్ధరామయ్య ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆ వర్గం ఓట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఎడ్యూరప్పను మాత్రమే నమ్ముకుని, మత సమీకరణాలతో ఓట్లు రాబట్టుకోవడం కష్టమనేది భాజపాకి అర్థమైంది. దీంతో కర్ణాటకలో కూడా మోడీ వేవ్ మాత్రమే పనిచేస్తుందన్న విశ్లేషణకు వచ్చారట. అయితే, వాస్తవంలో దక్షిణాదిన మోడీ హవా ఇప్పుడు పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు. దక్షిణాది రాష్ట్రాల పట్ల భాజపాకి చిన్నచూపు అనే ఒక స్థాయి వ్యతిరేకత బాగా ప్రచారంలో ఉంది. కాబట్టి, కేవలం మోడీ కటౌట్ పెట్టుకుని కర్ణాటక ఎన్నికలకు దిగితే ఫలితం భాజపాకి సానుకూలంగా మారిపోతుందని చెప్పలేం. ఓవరాల్ గా భాజపాపై వ్యతిరేకత, మోడీపై మరింత వ్యతిరేకత దక్షిణాదిన బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మోడీ ప్రచార వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.