దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటింది. దేశ ప్రజాస్వామ్యంపై ..ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలపై ఇంత వరకూ ఎవరూ దాడి చేయలేదు. ఎన్నికల విధానాలను మర్చాలనుకోలేదు. ఇండియా అంటే ఇందిర.. ఇందిర అంటే ఇండియా అన్న పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ కూడా అలాంటి ఆలోచన చేయలేదు. కానీ నరేంద్రమోడీ గారు చేస్తున్నారు. ఆయన దేశ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను మార్చేస్తున్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పేరుతో ఎన్నికల తీరును మార్చేందుకు సిద్ధమవుతున్నారు.
రాజ్యాంగాన్ని మార్చేస్తారా ?
లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని.. ఎన్నికల నుంచి పరిపాలనా దృష్టిని అభివృద్ధిపై మళ్లించవచ్చని మోదీ చెబుతున్నారు. అందుకే రాజ్యాంగాన్ని మార్చి అయినా జమిలీ ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారు. ఇది జరగాలంటే రాజ్యాంగంలో ఒకటి కాదు ఏకంగా ఐదు సవరణలు అవసరం. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో వెల్లడించారు. ఆ సవరణల కోసమే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుందనే టాక్ వినిపిస్తోంది. అంటే రాజ్యాంగంలోని మౌలిక సిద్దాంతాల్ని మార్చడమే.
మళ్లీ మళ్లీ ఎందుకు ఒక్కసారే వన్ నేషన్ – వన్ పార్టీ అని పెట్టుకుంటే పోలా ?
మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో రాత్రికి రాత్రి వేసిన కమిటీ చేసే అధ్యయనం ఏమీ ఉండదు. బీజేపీ పెద్దలు ఇచ్చే నివేదికపై ఆ కమిటీ సంతకం ేచస్తుంది. జమిలీ ఎన్నికలకు ఉన్న అడ్డంకులు రాజ్యాంగ సవరణల ద్వారా తీర్చేవి కావని.. ప్రాక్టికల్ గా వచ్చే సమస్యలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఎన్నికల విధానం వల్ల వస్తున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంది కానీ రాజకీయ కారణాలతో జమిలీకి వెళ్లడం…దేశానికి నష్టం. అలాంటి రాజకీయ కారణాలతో తర్వాత వన్ నేషన్ – వన్ పార్టీ అని చైనా తరహా విధానానికి ప్రతిపాదనలు రావొచ్చు. అలాంటిదేదో ఇప్పుడే చేసేస్తే ప్రజలు టెన్షన్ లేకుండా అలవాటు పడిపోతారు.
అంతిమంగా నియంతృత్వమే లక్ష్యం !
కేంద్రం ఏ మార్పులు తీసుకు రావాలనుకుంటున్నా.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మార్పు వస్తుంది. ఇది దేశానికి మంచిదా కాదా అన్నది.. బిల్లులు పెట్టిన తర్వాత ఎలాగూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ కేంద్రం ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతుంది. ఎందుకంటే అధికారం కేంద్రం చేతుల్ల ోఉంది. ఒక వేళ ప్రజావ్యతిరేకమైనా ఆమోదిస్తే జరిగే నష్టం దేశానికే కానీ బీజేపీకి కాదు. మొత్తంగా దేశం గురించి ఆలోచిస్తే రాజకీయ అధికారం అనేది ఒక్కరి చేతిలో ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉండటం వల్ల రాజకీయాధికారం అంతా ఒక్కరి చేతుల్లోకి వెళ్లదు. ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల ఒక్కరి చేతికే అధికారం వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. అది నియంతృత్వానికి దారి తీస్తుంది.