కడప ఉక్కు కర్మాగారం వ్యవహారం భాజపాకి తలనొప్పిగానే మారుతోంది. ఇతర హామీల విషయంలో ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉన్నా… కడప స్టీల్ ప్లాంట్ దగ్గరకి వచ్చేసరికి రాజకీయంగా ఏపీలో భాజపా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. సాంకేతికంగా పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం చెబుతున్నా… రాష్ట్ర స్థాయిలో భాజపా నేతలు మాత్రం స్టీల్ ప్లాంట్ వచ్చి తీరుతుంది అంటున్నారు. భాజపా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కూడా పదేపదే ఇదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ సమస్య ఎలా మారిందంటే… కడప ఉక్కు పరిశ్రమ తెచ్చామనే భరోసా ప్రజలకు కల్పించడం కోసం ఏదో ఒకటి చేయాల్సిన రాజకీయ అవసరం భాజపాకి ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడ్డామని చెప్పడమే తప్ప, ఆ కట్టుబాటు ఏంటనేది కార్యాచరణలో భాజపా ఇంతవరకూ చూపలేకపోయింది కదా.
పరిశ్రమ ఏర్పాటుపై ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం, లేదా ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం భాజపాకి కనిపిస్తోంది. అలాగని, పరిశీలనతో ఉందీ, కేంద్రం కంకణం కట్టుకుని ఉందీ తరహా ప్రకటనలు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర భాజపా నేతలు జాతీయ నాయకత్వానికి నివేదించినట్టు సమాచారం..! రాజకీయంగా ఉక్కు కర్మాగారం పేరుతో కొంత మైలేజ్ సాధించాలంటే… ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కడపలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన జరిపిస్తే బాగుంటుందనే ఆలోచన రాష్ట్ర భాజపానేతో ఒక వర్గం నుంచి వ్యక్తమౌతోందని సమాచారం. ఇదే విషయాన్ని బి.జె.వై.ఎమ్. రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి మోడీ వస్తారనీ, కడపలో కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమం త్వరలో జరిగి తీరుతుందని ఆయన ధీమాగా ప్రకటించేశారు! ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదనీ, రాష్ట్ర ప్రభుత్వం అవసరంగా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయం లేదు. సాధ్యాసాధ్యాలు ఇతర అంశాలు దేవుడికి ఎరుక! ఈలోగా ఒక శంకుస్థాపన కార్యక్రమం ఏపీలో పెట్టేస్తే… రాజకీయంగా టీడీపీ నోళ్లు మూయించొచ్చు కదా అనే ధోరణిలో ఏపీ భాజపా నేతలు ఆలోచిస్తున్నట్టు అర్థమౌతోంది. ఇప్పటికిప్పుడు శంకుస్థాపన చేసినా ఒరిగేదేం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఎన్నికల ముందు ఇలాంటి కార్యక్రమం ఏపీలో పెట్టుకుంటే, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే ప్రచారం భాజపా భారీగా చేసుకునే అవకాశం వస్తుంది. పనులు ముందుకెళ్తాయా, వెళ్లవా అనేది తరువాతి సంగతి అన్నట్టుగా కనిపిస్తోంది భాజపా వైఖరి.