విశాఖలో పాలనా రాజధాని శంకుస్థాపనకు… రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయం.. గవర్నర్ సంతకం పెట్టిన రోజే..పరోక్షంగా వెల్లడించారు. విశాఖలో పాలనా రాజధానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానిస్తామని కూడా తెలిపారు. ఏపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి.. విశాఖను పాలనా రాజధానిగా చేయాలన్న ఆలోచనతో ఉంది. అందుకే… అక్కడ ముందుగా పెద్ద ఎత్తున భూములను.. మౌలిక సదుపాయాలను… పరిశీలించి.. రెడీగా పెట్టుకుంది. కాపులుప్పాడ వద్ద ఆదానికి కేటాయించిన భూములన్నిటినీ వెనక్కి తీసుకుంది. ఆ భూముల్లోనే… పరిపాలనా నగరి పెట్టే ఆలోచన చేస్తున్నారంటున్నారు.
విశాఖలోనూ.. భోగాపురంలోనా… లేక మరో చోటనా… అన్నదానిపై ప్రభుత్వం బహిరంగంగా ఇంత వరకూ ప్రకటన చేయలేదు. ఆ మాటకొస్తే.. రాజధానుల విషయంలోనూ అదే విధానం. ఎక్కడ శంకుస్థాపన చేయాలన్నదాన్ని… చివరి వరకు గోప్యంగా ఉంచే అవకాశం ఉంది. తాత్కాలికంగా… పాత భవనాల్లో సీఎంవో లేదా… సెక్రటేరియట్ ఏర్పాటు చేసినప్పటికీ… తర్వాత ఓ పరిపానా నగరం నిర్మించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అమరావతిలో కట్టిన భవనాల కన్నా విశాలంగా… అద్భుతంగా కట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. దీని కోసం.. కనీసం వెయ్యి కోట్లు అయినా వెచ్చించినా ఇబ్బంది లేదన్న ఆలోచన చేస్తున్నారు.
రాజధాని శంకుస్థాపనకు జగన్ ఆహ్వానిస్తే… ప్రధానమంత్రి నరేంద్రమోడీ… వస్తారా అన్న చర్చ రాజకీయాల్లో వస్తుంది. ఒకే రాష్ట్రంలో.. రెండో సారి రాజధానికి శంకుస్థాపనకు ఎలా వస్తారనే విమర్శలు సహజంగా వస్తాయి. అయితే.. అలాంటి వాటిని చాలా సమర్థంగా తిప్పికొట్టి.. ప్రజల్లో అవున్నిజమే.. ఆయన రావడమే మంచిది అనే అభిప్రాయం కల్పించడంలో… బీజేపీ, వైసీపీ సిద్ధహస్తులు. కాబట్టి.. విమర్శలకు భయపడి రాకపోవడం అనేది ఉండకపోవచ్చు. పాలనా రాజధాని శంకుస్థాపన సమయానికి మోడీకి తీరిక ఉంటే.. వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.