టీమ్ ఇండియా.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందా… అదేనండీ భారత క్రికెట్ జట్టును టీమ్ ఇండియా గా పేరుపెట్టారు… గుర్తొచ్చిందా. టీమ్ ఇండియాగా మారగానే భారత జట్టు అద్వితీయమైన విజయాలను సాధించడం ప్రారంభించింది. ఆ స్ఫూర్తో ఏమో గానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట ఇప్పుడు ఆ మాట వినిపించింది. ఇది క్రికెట్‌కో మరో ఆటకో సంబంధించింది మాత్రం కాదు. దేశాభివృద్ధికి అన్ని రాష్ట్రాలూ కలిసి పనిచేయాలని చెప్పేందుకు ఈ పదాన్ని ఉపయోగించారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశ వేదికపై టీమ్ ఇండియా అనే బ్యానర్ కనిపించింది. ఈ బ్యానర్‌తో మోడీ తన ఉద్దేశాన్ని ఆహూతులకు ముందే చెప్పేశారు. కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని నేరుగా తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధులు కలలుగన్న అభివృద్ధి చెందిన భారత్‌ను 2022కు సాకారం చేయాలని ప్రధాని ఈ సమావేశంలో స్పష్టంచేశారు. 2022నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం లభించి, 75 సంవత్సరాలవుతుంది. లక్ష్యం, గమ్యం నిర్దేశించుకుని కలిసి కట్టుగా సాగితే ఛేదన అసాధ్యం కాదని చెప్పడం మోడీ ఉద్దేశం. ఈ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలతో సమైక్యంగా పనిచేయాలని నరేంద్ర మోడీ దిశా నిర్దేశం చేశారు.
ప్రధాని అంతరంగమూ, కార్య నిర్దేశన, లక్ష్యాన్ని చెప్పడం బాగానే ఉంది. వివిధ రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఆయనకు సహకరిస్తాయా. అదయితేనే కదా టీమ్ ఇండియా స్ఫూర్తి నిలిచేది. ప్రతిపక్షం కకావికలైపోయే, బీజేపీకి వ్యతిరేకంగా మహాఘటబంధన్‌ను ఏర్పాటుచేయాలనీ, వచ్చే ఎన్నికల్లో ఇరుకున పెట్టాలనీ చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీమ్ ఇండియా సాధ్యమైనా.. అన్నట్లు ఈ సమావేశానికి 13 రాష్ట్రాల బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. నితీశ్ కుమార్, మమతా బెనర్జీ అసలు సమావేశానికే హాజరుకాలేదు. సిద్ధాంతపరంగా విభేదాలున్నా దేశాభివృద్ధికి సంబంధించిన సమావేశానికి వీరిద్దరూ హాజరుకాకపోవడం దేనికి సంకేతం. అందరూ కలిస్తేనే కదా టీమ్ ఇండియా ఏర్పడేది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి