గెలుపు రుచి చూసిన తర్వాత ఇక ఎవరైనా ఆగుతారా..? ఇప్పుడు మోహన్ బాబు కుటుంబ ఆలోచనలు అలాగే ఉన్నట్లుగా ఉన్నాయి. గెలుపు చాన్సే లేదనుకున్న చోట ఎదురు నిలబడి విజయం సాధించారు. తన పలుకుబడితో ఓటింగ్ శాతం పెంచుకుని మరీ విజయం సాధించారు. నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికయినప్పుడు పోలైన ఓట్ల కంటే కనీసం రెండు వందల ఓట్లు ఈ సారి ఎక్కువ పోలయ్యాయి. ఈ రెండు వందల ఓట్లే ఫలితాలను తేల్చేశాయి. ఇవన్నీ మంచు ఫ్యామిలీ తమ పరిచయాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్న వారిని తీసుకొచ్చినవే. చివరికి జయప్రద, జెనిలియా లాంటి వారిని కూడా ఓటింగ్‌కు తీసుకు రాగలిగారు.
మంచు ఫ్యామిలీ ఇంత వరకూ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరేళ్ల పాటు ఉన్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి ఆసక్తి చూపించలేదు. కానీ ఎప్పుడూ రాజకీయాల్లో ఉన్నట్లే ఉంటారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ప్రచారం చేశారు.
గతంలో ఆయన కుమార్తె మంచు లక్ష్మి తిరుపతి నుంచి పోటీ చేయడానికి ఓ ప్రధాన రాజకీయ పార్టీ తరపున అవకాశం కోసం ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆయన తాను రాజకీయాలకు 99 శాతం దూరం అని ప్రకటించారు. కానీ ఒక్క శాతం ఆప్షన్ ఉంచుకున్నారు. ఆ ఒక్క శాతం ఎందుకు అంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ఇంటికి ఎప్పుడైనా రావొచ్చని ఆఫర్ ఇచ్చారట. అయితే ఇప్పుడు గెలుపు రుచి చూసిన తర్వాత..అది ఎంత బాగుంటుందో అనుభవించిన తర్వాత ఇక మోహన్ బాబు ఆగే అవకాశం లేదంటున్నారు.