టాలీవుడ్‌ను చాలా సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఇతర సమస్యల సంగతేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించిన సమస్యలు మాత్రం టాలీవుడ్‌కు చాలా ఉన్నాయి. టిక్కెట్ రేట్లను దారుణంగా తగ్గించడం దగ్గర్నుంచి ఇప్పటికీ ధియేటర్లపై కరోనా ఆంక్షలు తొలగించకపోవడం వరకూ చాలా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి దఫదఫాలుగా చర్చలు జరిగాయి. కానీ ఫలితం లేదు. ఆ చర్చల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా గుర్తించింది. మంత్రి పేర్ని నాని చిరంజీవికే ఫోన్ చేసి.. సమస్యలు చెప్పుకోవడానికి రావాలని సూచించారు.
ఆ తర్వాత కూడా చిరంజీవి కేంద్రంగానే ప్రభుత్వంతో చర్చలు.. రచ్చ జరిగాయి. అయితే ఇప్పుడు సీన్ మారింది. మా ఎన్నికలు ముగిసిన తర్వాత చిరంజీవి డల్ అయ్యారు. ఇప్పుడు మోహన్ బాబు గెలిచారు. మోహన్ బాబు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీ తరపున వకాల్తా పుచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం ఉంది.
ఇక ఏపీ ప్రభుత్వంతో సమస్యల పరిష్కారం కోసం మంచు విష్ణుతో పాటు ఆయన తండ్రి మోహన్ బాబునే స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తే.. మోహన్ బాబు పలుకుబడి మరింత పెరుగుతుంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయో స్పష్టత లేదు. చర్చించుకోవడానికి మంత్రి పేర్ని నాని మళ్లీ చిరంజీవిని పిలుస్తారా.. మోహన్ బాబును పిలుస్తారా అన్నదానిపై వారి విధానం ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు.