భారతీయ జనతా పార్టీలో అద్వానీ, మురళీమనోహర్ జోషిలను.. మోడీ, అమిత్ షా జోడి పక్కన పెట్టేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ ఇద్దరు నాయకులను పక్కన పెట్టే ప్రయత్నాల్లో భాగంగా వీరిని ప్రస్తుత నాయకత్వం పార్టీ మార్గదర్శక మండలిలో సభ్యులుగా నియమించింది. ఈ మండలి గత ఐదేళ్లలో ఏనాడూ సమావేశం కాలేదు. వారాణసీలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జోషిని పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీనికి జోషి కూడా సుముఖంగానే ఉన్నారని తెలియడంతో… మోడీ,షా క్యాంప్‌లో కలకలం బయలురేదింది. నిజానికి వారణాశి జోషి.. కంచుకోట. ఆయన గత ఎన్నికల్లో మోడీ కోసం దాన్ని త్యాగం చేసి కాన్పూర్‌కి వెళ్లారు.
ఎన్నికల్లో లోక్‌సభ టికెట్ దక్కనందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్న అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చర్చలు జరిపారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి సైతం ఈ ఇద్దరు సీనియర్లు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ముందుగా జోషి నివాసానికి, అనంతరం ఆద్వానీ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. 75 ఏళ్లు పైబడిన నాయకులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వరాదని పార్టీ నిబంధనలు విధించుకున్న నేపథ్యంలో వీరికి టిక్కెట్లు ఇవ్వలేదని అమిత్ షా చెబుతున్నారు. అయితే, పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న సీనియర్లను బుజ్జగించడానికి షా వారిని కలుసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానానికి 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 91 ఏళ్ల అద్వానీకి బీజేపీ నాయకత్వం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఇటీవల ఆడ్వాణీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మురళీ మనోహర్ జోషి కూడా తనకు కాన్పూర్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వనందుకు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీరిలో ఎవరైనా మోడీకి వ్యతిరేకంగా నిలబడితే.. అది రాజకీయ సంచలనం కానుంది.