గత నెల 5వ తేదీన నిర్వహించిన నీట్ ( నేషనల్ ఎలిజిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ), యూజీ ఫలితాలు తీవ్ర వివాదాస్పదం కావడంతో నీట్ మళ్లీ నిర్వహించాలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఫలితాలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆరోపణలతో నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీపై ఒత్తిడి నెలకొంది. దీంతో ఎన్టీఏ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది కీలకంగా మారింది.
ఇప్పటికే నీట్ పరీక్షలను మరోసారి నిర్వహించాలని కోరుతూ ఓ విద్యార్ధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఉల్లంఘనకు గురైందని… ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని దాంతో మరోసారి ఫ్రెష్ గా ఎగ్జాం నిర్వహించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టుకు వేసవి సెలవులున్న నేపథ్యంలో వెకేషన్ బెంచ్ ముందు లిస్టింగ్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
మరోవైపు, నీట్ ను మళ్లీ నిర్వహించాలని కోరుతూ ఒకరు కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం సరైన ఆన్సర్ రాస్తే ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు వేస్తారని, తప్పడు సమాధానంకు ఓ మార్క్ మైనస్ అవుతుందని పేర్కొన్నారు. కానీ, విడుదలైన ఫలితాల్లో కొతమంది విద్యార్థులకు 719,718 మార్కులు వచ్చాయని, అసలు నిబంధనల ప్రకారం అలా రావడానికి అవకాశమే లేదని, వస్తే 715,720రావాలన్నారు. దీంతో ఈ విషయం మరింత వివాదం అవుతుండటంతో నీట్ ను మళ్లీ నిర్వహిస్తారా..? అనే చర్చ జరుగుతోంది.