‘కార్తికేయ 2’తో నిఖిల్ రేంజ్ మారింది. తను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్థాయిలో వర్కవుట్ అయ్యేలా కథలు ఎంచుకొంటున్నాడు. అయితే నిఖిల్ నుంచి సడన్ గా ఓ సినిమా వస్తోంది. అదే ‘అప్పుడు ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్ వర్మ దర్శకుడు. నిఖిల్ – సుధీర్ వర్మలది హిట్ కాంబినేషన్. ఇద్దరి కలయికలో ‘స్వామి రారా’ సినిమా వచ్చింది. నిఖిల్ కెరీర్‌కి బూస్టప్ ఇచ్చిన సినిమా స్వామి రారా. సుధీర్ వర్మ కూడా ఈ సినిమాతో సెటిల్ అయిపోయాడు. అప్పటి నుంచీ ఈ కాంబో గురించి ఎదురు చూస్తోంది టాలీవుడ్. ఎట్టకేలకు ఈ సినిమాతో సాధ్యమైంది.
కాకపోతే.. దీనిపై ఎలాంటి జబ్ లేదు. ఎందుకంటే… కరోనా టైమ్ లో మొదలైన సినిమా ఇది. మధ్యలో ఆగింది. ఆ తరవాత… సుధీర్ వర్మ రవితేజతో ఓ సినిమా చేయడం, అది విడుదలై సైలెంట్ గా వెళ్లిపోవడం కూడా జరిగిపోయాయి. అంటే… నిఖిల్ కి పాన్ ఇండియా ఇమేజ్ రాకపూర్వం మొదలైన ప్రాజెక్ట్ ఇది. ఈలోగా నిఖిల్ ప్రాధాన్యతలు మారిపోయాయి. సినిమా కూడా ఆలస్యం అవ్వడంతో దానిపై నిఖిల్ కి ఆసక్తి తగ్గిందని, అందుకే ఈ సినిమా ప్రమోషన్లకు నిఖిల్ రాడని ప్రచారం జరిగింది. ఈనెల 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అంటే నాలుగు రోజుల సమయం కూడా లేదు. ప్రమోషన్లు కూడా మొదలెట్టలేదు. మరోవైపు.. ఓ కామన్ ఇంటర్వ్యూ వదిలారు. నిఖిల్, సుధీర్ వర్మతో పాటు చందూ మొండేటి చిట్ చాట్ చేసుకొన్న వీడియో ఇది. దాంతో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టినట్టైంది. ఈ ఇంటర్వ్యూతో సరిపెడతారా, లేదంటే నిఖిల్ కాస్త కరుణించి, ప్రమోషన్ల బరిలో దిగుతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. చేస్తే ఈ నాలుగు రోజుల్లోనే చేయాలి. లేదంటే ఎలాంటి పబ్లిసిటీ, బజ్ లేకుండా విడుదలైన సినిమాల్లో ఇదొకటిగా మిగిలిపోతుంది.