టాలీవుడ్‌లోని హాట్ టాపిక్కుల్లో `లక్ష్మీస్ ఎన్టీఆర్` ఒకటి. ఎన్టీఆర్ బయోపిక్‌కి పోటీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు వర్మ. ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణాల్ని బయటపెడతానని కుండబద్దలుకొట్టినట్టు చెబుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి లక్ష్మీ పార్వతి దగ్గర ముందస్తు అనుమతి తీసుకున్నాడు వర్మ. ఈ సినిమా ప్రారంభోత్సవానికీ ఆమె హాజరయ్యారు. అయితే… సినిమా తీసే ముందు స్క్రిప్టు తనకు చూపించాలన్నది లక్ష్మీపార్వతి కండీషన్. దాన్ని తుంగలో తొక్కేస్తున్నాడు వర్మ. స్క్రిప్టు లక్ష్మీ పార్వతికి చూపించే ప్రసక్తే లేదని తేల్చేశాడు.
”నేనో కథ చెప్పి, మరో కథ తీస్తే.. పరిస్థితి ఏంటి? సినిమా అనేది పరస్పర నమ్మకంతో ముందుకెళ్లాలి. నన్ను లక్ష్మీపార్వతి నమ్మితే చాలు. స్క్రిప్టు మాత్రం ఆమెకు చూపించే ప్రసక్తే లేదు” అని మీడియా ముందే చెప్పేశాడు. ఈ సినిమాలో స్టార్లెవరూ కనిపించర్ట. అన్ని పాత్రలకూ కొత్తవాళ్లనే ఎంపిక చేసుకున్నామని వర్మ చెబుతున్నాడు. ”స్టార్ డమ్ ఉన్న నటీనటులెవరూ ఈ బయోపిక్‌లో కనిపించరు. కొన్ని పాత్రలకు స్టార్ డమ్ అవసరం లేదు. ఎలాంటి ఇమేజ్ లేని నటులు చేస్తేనే బాగుంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా” అన్నాడు వర్మ.