తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. నటుడిగా, ప్రజా నేతగా ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేం. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. తెలుగువాడికి భారత రత్న ఇస్తే.. తొలుత ఇవ్వాల్సింది ఎన్టీఆర్కే అని ఆయన అభిమానులు బల్లగుద్ది చెబుతుంటారు. చాలాసార్లు.. భారతరత్న రేసులో ఎన్టీఆర్ పేరు గట్టిగా వినిపించింది. `ఈసారైనా వస్తుంది` అని అభిమానులు ఆశ పడడం.. మరొకరరి పేరు తెరపై రావడం ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో పద్మ పురస్కారాల్ని ప్రకటించబోతోంది కేంద్రం. ఆరోజే భారతరత్న ఎవరన్నది తెలిసిపోతుంది. ఈసారైనా ఎన్టీఆర్ కి ఈ పురస్కారం వరిస్తుందేమో అన్నది అభిమానుల ఆశ.
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనుకొంటే.. ఇదే సరైన తరుణం. ఎందుకంటే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇస్తే.. ఆ సంబరాలు మరింత రెట్టింపు అవుతాయి. కేంద్రం దగ్గర ఉన్న తుది జాబితాలో ఎన్టీఆర్ పేరు ఉందన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అన్ని సమీకరణాలు కుదిరితే.. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒకవేళ.. ఈసారి ప్రకటించకపోతే… ఇంకెప్పటికీ ఈ అవకాశం రాదేమో..? ఏం జరుగుతుందో చూడాలి.