ఒడిఐ క్రికెట్ ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్మాట్. కానీ ఇప్పుడు క్రికెట్ అభిమానులు వన్ డేలపై ఆసక్తి కోల్పోతున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడంతా టీ20 క్రికెట్ యుగం. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ వంటి లీగ్‌లు ప్రేక్షకులను ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. టీ20 మ్యాచ్‌లు వేగంగా ముగుస్తాయి. ప్రతి ఓవర్ లో ఉత్కంఠ వుంటుంది. మ్యాచ్ చూడటానికి రోజులో ఒక పూట కేటాయిస్తే చాలు. దీంతో ఒడిఐల కంటే టీ20లను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు.
ఐదు రోజులు జరిగే టెస్టు క్రికెట్ పట్ల మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. అది ఆటగాళ్ళ క్లాస్ సామర్ధ్యానికి అద్దం పట్టే ఫార్మెట్ గా చూస్తున్నారు. దీంతోపాటు ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ప్రవేశపెట్టిన తర్వాత దీనికి మరింత ప్రాధాన్య వస్తోంది. అసలైన క్రికెట్ అనుభూతిని టెస్టు మ్యాచ్‌ల్లోనే పొందొచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఒడిఐ మ్యాచ్ అంటే ఒక రోజు గడిచిపోనట్లే. ఒకప్పుడు వంద ఓవర్లు చూడటానికి ఎలాంటి ఇబ్బంది అలసట వుండేది కాదు. అప్పుడు అదొక్కటే ఫార్మెట్ కావడంతో క్రికెట్ అభిమానులకు మరో ఆప్షన్ వుండేది కాదు. ఇప్పటి తరం అభిమానులకు అంత సమయం ఉండటం లేదు. పైగా ఇప్పుడు టీ20 మ్యాచ్‌లు తక్కువ సమయంలో ఎక్కువ వినోదాన్ని అందిస్తాయి.
పైగా ఇప్పటి ఒడిఐ సిరీస్‌లు పెద్దగా ఉత్కంఠను కలిగించడంలేదు. ఎక్కువగా ద్వైపాక్షిక సిరీస్‌లే జరుగుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. ప్రపంచకప్ సమయంలో మాత్రమే ఒడిఐలకు కొంత ప్రాముఖ్యత లభిస్తున్నప్పటికీ అది ఫార్మెట్ ని నిలబెట్టడానికి సరిపోదు.
అయితే ఒడిఐ క్రికెట్ మీద ఆసక్తి తగ్గుతున్నా, ఇది ఇప్పటికీ ఒక మంచి ఫార్మాట్. అయితే ట్రెండ్ కి తగ్గట్టు ఇందులో కూడా కొన్ని మార్పులు చేసి ఒడిఐల ఆకర్షణను పెంచేందుకు కొత్త మార్గాలు అన్వేషించాలి. ఫార్మెట్ ని, జట్ల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చిగలిగితే మళ్లీ ఒడిఐ క్రికెట్ కు పునర్వైభవం దక్కే అవకాశం వుంది.