భాజపాలో కీలక బాధ్యతలు వహిస్తారు, తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఆయన్ని ఏదో రకంగా కీలకం చేస్తారనే అంచనాల నేపథ్యంలో… ఆ మధ్య ఢిల్లీకి వెళ్లొచ్చారు శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి. ఓ పదిరోజుల కిందట భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయనకి మరోసారి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈ పర్యటనలో అమిత్ షాతోపాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా సమావేశం అవుతారని తెలుస్తోంది. తాజా పర్యటనలో పరిపూర్ణానందకు ఇవ్వబోయే కీలక బాధ్యతలపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
పదిరోజుల కిందట.. అమిత్ షాతో భేటీ అయ్యాక, ఆయన ఆదేశాలకు మేరకే తన కార్యక్రమాలు ఉంటాయనీ, ఇందులో తన ఆలోచన అంటూ సొంతంగా ఏమీ లేదన్నారు పరిపూర్ణానంద. ఆ ఆదేశాలు ఏంటనేది మరోసారి భేటీ అయ్యాక స్పష్టత వస్తుందని అప్పుడు చెప్పారు. దీంతో శుక్రవారం నాడు ఆయన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాను భాజపాలోకి ఎప్పుడు చేరతారనేది శుక్రవారం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. నిజానికి, దసరా పండుగను గురు, శుక్ర.. ఈ రెండ్రోజుల్లోనూ చాలామంది జరుపుకొంటున్నారు. దశమి తిథి శుక్రవారమూ ఉండటంతో… మంచి రోజు కాబట్టి, రాజకీయాలకు సంబంధించి పరిపూర్ణానంద ఒక ప్రకటన చేస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది.
వాస్తవం మాట్లాడుకుంటే… ఇప్పటికిప్పుడు పరిపూర్ణానందకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అంటూ అప్పగించే అవకాశాలు కొంత తక్కువే. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పాత్ర ఏమంత కీలకం కాదనే సంగతి ఢిల్లీ పెద్దలకీ తెలుసు. తెలంగాణలో కొంతైనా ఉంటుందేమోగానీ, ఆంధ్రాలో భాజపా పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. అయితే, మరో ఐదేళ్ల తరువాతైనా తెలుగు రాష్ట్రాల్లో గట్టి పునాదులు ఏర్పరచుకోవాలంటే.. ఇప్పట్నుంచే ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం భాజపా చేస్తున్నది కూడా అదే. పరిపూర్ణానందను ఇప్పట్నుంచీ ప్రోత్సహిస్తున్నా.. మరో ఐదేళ్ల తరువాత ఆయన పార్టీకి ఉపయోగపడతారన్న వ్యూహం భాజపాకి ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే, ఈ స్వామీజీల ఫార్ములా ఉత్తరాదిన వర్కౌట్ అయినంతగా దక్షిణాదిన అవుతుందా అనేదే వేచి చూడాల్సిన అంశం.