మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి రావడం దాదాపు ఖరారు అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈవారంలోనే కిరణ్ పార్టీలో అధికారికంగా చేరబోతున్నట్టు సమాచారం. అయితే, ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలౌతోంది..! కిరణ్ కుమార్ రాకవల్ల కాంగ్రెస్ కు కొత్త ఊపు వస్తుందా..? ఆయన్ని కీలకం చేసినంత మాత్రాన గతంలో పార్టీ వీడిన నేతలు వెనక్కి వస్తారా..? వచ్చే ఎన్నికల నాటికి ఆయన క్రియాశీలంగా మారాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది, మరి ఆ సంకల్పంతోనే కిరణ్ పార్టీలోకి వస్తున్నారా..? అన్నిటికీ మించి, ఆంధ్రా ప్రజల్లో జీర్ణించుకుపోయిన కాంగ్రెస్ వ్యతిరేకత కొంతైనా తగ్గిందా.. ఇలాంటి అంశాలు ఇప్పుడు చర్చనీయం అవుతున్నాయి.
ఆంధ్రుల్లో కాంగ్రెస్ పై ఇప్పటికీ వ్యతిరేకత తగ్గలేదు అనడానికి ఎలాంటి సందేహం లేదు. విభజన సశాస్త్రీయంగా జరగలేదు కాబట్టే… ఇప్పుడు ఏపీ చాలా సమస్యలు ఎదుర్కొంటోందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఏపీ విషయంలో భాజపా నిర్లక్ష్య వైఖరి కూడా కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకతను అలా నిలిపి ఉంచిన పరోక్ష కారణంగా చెప్పుకోవచ్చు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాల అంశంపై కట్టుదిట్టమైన చట్టాలు చేసి ఉంటే, ఇవాళ్ల ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం అలానే ఉంది. సరే, విభజన జరిగి నాలుగేళ్ల అయిపోయిందీ, కాంగ్రెస్ ను ప్రజలు క్షమించాశారు అనే వాతావరణం కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఆ మధ్య జరిగిన నంద్యాల ఉప ఎన్నికలే ఇందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఏపీలో కాంగ్రెస్ నేతలంతా నంద్యాలలో భారీగా ప్రచారం చేశారు. ఖర్చు కూడా బాగానే పెట్టారని టాక్! అయినాసరే, ఏమాత్రం ప్రభావితం చూపలేకపోయింది.
ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను ఎలా ముందుకు తీసుకెళ్లగలరు అనేదే సవాల్. పోనీ, వ్యక్తిగతంగా చూసుకున్నా.. గడచిన నాలుగేళ్లుగా కిరణ్ క్రియాశీలంగా లేరు. తటస్థంగా ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలోకి రాగానే ముందుగా రాష్ట్ర ప్రయోజనాల గురించి, భాజపా నిర్లక్ష వైఖరిపై పోరాటమంటూ కొత్తరాగం ఎత్తుకోవాల్సి ఉంటుంది. మేం అధికారంలోకి వస్తే ఏపీ న్యాయం జరుగుతుందని కిరణ్ చెప్పాలి. కానీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తుంటే… తీవ్రంగా వ్యతిరేకించిందీ ఈ కిరణ్ కుమార్ రెడ్డే కదా! కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని కిరణ్ ప్రకటనలు చేస్తే.. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని చెప్పలేం..! సో.. వ్యక్తిగతంగా చూసుకున్నా, పార్టీపరంగా చూసుకున్నా కాంగ్రెస్ లోకి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చీరాగానే పార్టీకి కొత్త ఊపు వచ్చేస్తుందన్న పరిస్థితులైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఆయనతోపాటు ఇబ్బడిముబ్బడిగా ఇతర నేతలూ పార్టీలోకి తిరిగొస్తే… కొంత ఎటెన్షన్ వస్తుంది. కానీ, నేతల్ని తిరిగి పార్టీలోకి ఆకర్షితం చేయగలిగే అంశమేదీ కాంగ్రెస్ లో కనిపించడం లేదు..!