పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. అయితే జస్ట్ మర్యాదపూర్వకంగానే కలిశానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. భేటీ జరిగిన సమయం కూడా అంతే ఉంది. కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే ఆయన అమిత్ షా నివాసంలో ఉన్నారు. మర్యాదలు, పలకరింపులు అయిపోయిన తరవాత సూటిగా విషయం మాట్లాడేసుకుని సమావేశం ముగించారు. ఆ విషయం ఏమిటన్నది కాస్త సస్పెన్స్ గానే ఉంది.
మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేయమని పవన్ ను అమిత్ షా అడిగారని సమావేశం ముగిసిన తర్వాత ప్రచారం ఊపందుకుంది. మహారాష్ట్రలో తెలుగు ఓటర్ల ప్రభావం అధికంగానే ఉంటుంది. ముంబైతో పాటు నాసిక్, నాందేడ్, నాగపూర్ వంటి ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు ఉంటారు. వారి కోసం ప్రచారం చేయాలని పవన్ ను అడిగినట్లుగా చెబుతున్నారు. వారు అడిగితే చేయను అనే పరిస్థితి ఉండదు కాబట్టి పవన్ అంగీకరించి ఉంటారని భావిస్తున్నారు.
బీజేపీ ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. మహారాష్ట్రలో ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఒక వేళ చివరిలో పవన్ కల్యాణ్ ను ఒక రోజు .. తెలుగు ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగించుకోవచ్చు కానీ.. విస్తృత ప్రచారం ఉండకపోవచ్చంటున్నారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారంపై బీజేపీ ఇంత వరకూ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.