జనసేన ఆవిర్భావ సభను ఈ రోజు నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌ను దిశానిర్దేశం చేసే సభ అని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా చెప్పడంతో ఆయన జనసేన పార్టీ పోరాట కార్యాచరణ.. వచ్చే ఎన్నికలపై పొత్తులపై స్పష్టత ఇస్తారరని భావిస్తున్నారు. జనసేన పార్టీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకం. ఓట్లు చీలేలా ఆ పార్టీ ఒంటరిగా లేదా బీజేపీతో కలిసి పోటీ చేయాలనేది అధికార పార్టీ కోరిక. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభం కన్నా… ఆ పార్టీని విడిగా పోటీ చేయిస్తేనే ఎక్కువ లాభమని వైసీపీ ఎప్పుడో ఓ అంచనాకు వచ్చింది.
అయితే టీడీపీ నేతలు మాత్రం స్నేహ హస్తం అందిస్తున్నారు. ఆ పార్టీతో కలిసి పోటీ చేయడం వల్ల టు ప్లస్ టు ట్వంటీ అవుతుందని నమ్ముతున్నారు. అందుకే మిత్రపక్షం బీజేపీ కూడా నోరు తెరవని సందర్భాల్లో టీడీపీ నేతలు ముందడుగు వేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలుపుతున్నారు. జనసేనకు సంఘిభావం ప్రకటిస్తున్నారు. నిజానికి జనసేన ద్వితీయ శ్రేణి నేతలు ప్రాంతాల వారీగా టీడీపీతో కలిసిపోయారు. స్థానిక ఎన్నికల్లో ఇది నిరూపితమయింది.
మరో వైపు బీజేపీతో కలిసి పోటీ చేయడం వల్ల జనసేనకు ఒక్క ఓటు రాకపోగా.. మైనార్టీ, క్రిస్టియన్ ఓట్లు దూరం అవుతున్నాయి. ఇది చాలా పెద్ద సమస్యగా మారిందని జనసేనకు చెందిన అనేక మంది కీలక నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కల్యాణ్ కూడా ఇటీవలి కాలంలో బీజేపీకి దూరం పాటిస్తున్నారు. వారితో కలవడానికి ఇష్టపడటం లేదు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ పొత్తులపై కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ సారి పొత్తులేవి లేకుండా ఒంటరిగా పోటీ చేయడమా లేకపోతే ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుందామా అన్న చర్చ కూడా జరిగే అవకాశం ఉంది.
మరో వైపు పవన్ కల్యాణ్ బీజేపీ విషయంలో అంత సంతృప్తిగా లేరని తెలియడంతో బీజేపీ నేతలు ఎప్పుడూ లేని విధంగా… కొత్త వాదన తీసుకువస్తున్నారు. కడపలో పందొమ్మిదో తేదీన బీజేపీ ఓ సభ నిర్వహించాలనుకుంటోంది. ఈ సభకు నిన్నటిదికా బీజేపీ సభ అని చెప్పుకున్నారు. కానీ నిన్నటి నుంచి బీజేపీ- జనసేన సభ అని చెప్పడం ప్రారంభించారు. కొంత మంది ప్రజల్ని ఆకర్షించడంతో పాటు కలిసి రాజకీయ పోరాటం చేస్తున్నామన్న భావన కల్పించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. వర్కవుట్ అవుతుందో లేదో మరి !