పవర్‌స్టార్ అభిమానులకు మళ్ళీ నిరాశ ఎదురైయింది. పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ వాయిదా పడింది. సంక్రాంతి బరి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఈ వార్త పవన్ అభిమానులని తీవ్రంగా నిరాశ పరిచింది. వాయిదా పడటానికి కారణం.. ప్రొడ్యుసర్ గిల్డ్. ఆర్ఆర్ఆర్, ‘రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు సంక్రాంతి వుండటం చేత.. పవన్ కళ్యాణ్ సినిమా కూడా వస్తే.. ఆ సినిమాలకు నష్టం చేకూరుతుందని అభిప్రాయపడిన ప్రొడ్యుసర్ గిల్డ్.. పవన్ కళ్యాణ్ ని అభ్యర్ధించడం, పవన్ వాయిదాకి ఒప్పుకోవడం, ప్రొడ్యుసర్ గిల్డ్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది.
ప్రొడ్యుసర్ గిల్డ్ ప్రకటన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఆగ్రహం రేకెత్తించింది. పవన్ సినిమా కోసం ఆశగా ఎదురుచూశారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు అది కాస్త వాయిదా పడింది, దీనికి కారణం ‘భీమ్లానాయక్’ టీం అయితే వేరే సంగతి. కానీ పరిశ్రమ కోసం వెనక్కి తగ్గాడు పవన్ కళ్యాణ్. ఇదే ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం. పవన్ కళ్యాణ్ పరిశ్రమ గురించి, టికెట్ల రెట్లు తగ్గించడం గురించి మాట్లాడినప్పుడు.. ప్రొడ్యుసర్ గిల్డ్ నుంచి ఒక్కరు కూడా పవన్ కి తోడుగా నిలబడలేదు. ప్రభుత్వం నుంచి విమర్శలన్నీ పవన్ కళ్యాణే భరించాడు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ మొదటినుంచి ఆగ్రహంతో వున్నారు. ఇప్పుడు ‘పరిశ్రమ మేలు కోసం’ అంటూ పవన్ సినిమాని వెనక్కి తీసుకువెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్ధం చేసుకోవాలని ప్రొడ్యుసర్ గిల్డ్ నుంచి నిర్మాతలు కోరినప్పటికీ ..పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం తగ్గడం లేదు. ‘ఇండస్ట్రీ కోసం పవన్ ఎప్పుడూ నిలబడతారు. మరి పవన్ ని ఒక వర్గం టార్గెట్ చేసి విమర్శించినపుడు ప్రొడ్యుసర్ గిల్డ్ ఎక్కడికి వెళ్ళింది? పవన్ ఇండస్ట్రీ కోసం నిలబడతారు. మరి పరిశ్రమ.. పవన్ కోసం నిలబడదా ?” అని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు ఫ్యాన్స్. మరి దీనికి ఎవరు సమాధానం చెబుతారో చూడాలి.