హైదరాబాద్: అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ – వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖిల్’ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టీజర్ నాగార్జున జన్మదినం సందర్భంగా గతనెల 29న విడుదలయింది. ఇదిలా ఉండగా త్వరలో విడుదలకానున్న ఈ చిత్రం ఆడియోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారని ఫిల్మ్‌నగర్‌లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అఖిల్ చిత్రాన్ని నిర్మిస్తోంది పవన్ వీరాభిమాని నితిన్ కావటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. నితిన్ తన చిత్రాలలో ఏదో ఒక చోట పవన్ ఫోటోనో, పాటనో పెట్టటంగానీ, పవన్ ప్రస్తావన తేవటంగానీ చేస్తుండటం తెలిసిందే. వరసగా ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతుండగా, ఇష్క్ చిత్రం ఆడియోకు పవన్ రావటంవలనే అది హిట్ అయ్యి మళ్ళీ తన కెరీర్ గాడిలో పడినట్లు నితిన్ భావిస్తారని చెబుతారు. గబ్బర్ సింగ్ చిత్రంలోని ‘గుండెజారి గల్లంతయ్యిందే’ పాట చరణాన్ని తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకునికూడా నితిన్ హిట్ కొట్టారు. ఈ నేపథ్యంలో తన అభిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అఖిల్ చిత్రం ఆడియో విడుదలకు పవన్ హాజరయ్యే అవకాశాలు లేకపోలేదు.