సినిమాలా? రాజకీయాలా? అని అడిగితే నిస్సందేహంగా `రాజకీయాలు` అంటారు పవన్ కల్యాణ్. చేతిలో ఏ పదవీ లేనప్పుడే సినిమాలు వదిలేసి, సిన్సియర్‌గా పాలిటిక్స్ చేసిన వ్యక్తి పవన్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చేతిలో కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. బాధ్యత మరింత పెరిగింది. గత ప్రభుత్వంలోని మంత్రులకూ, ప్రస్తుత మంత్రులకూ తేడా చూపించాలంటే కష్టపడి పని చేయాల్సిందే. పైగా తన ఎం.ఎల్,ఏలకు కూడా 24 గంటలూ ప్రజలకు, నియోజక వర్గానికీ అందుబాటులో ఉండాలని పవన్ దిశానిర్దేశం చేశారు. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ రాజకీయాలకు మధ్యమధ్యలో బ్రేక్ ఇస్తూ, సినిమాలు చేస్తారనుకోవడం అత్యాసే.
కాకపోతే… తన నిర్మాతల్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా పవన్‌పై ఉంది. పైగా సగంలో ఆగిపోయిన సినిమాల్ని ఆయన తప్పకుండా పూర్తి చేయాల్సిందే. అందుకే కనీసం వారానికి రెండు రోజులు ఆయన సినిమాలపై దృష్టి పెట్టే ఆస్కారం కనిపిస్తోంది. చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేశాక, కొత్తగా కథలు వినేంత సాహసం పవన్ చేయకపోవొచ్చు. కానీ సినిమాలకు, చిత్రసీమకూ ఆయన టచ్‌లో ఉండే ఆస్కారం ఉంది. అదెలాగంటే.. నిర్మాతగా. పవన్ లో ఓ నిర్మాత కూడా ఉన్నాడు. పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ పేరుతో ఓ సంస్థని ఎప్పుడో స్థాపించారు. ఆ మధ్య యాక్టీవ్‌గా సినిమాలు చేయాలనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు ఆ సంస్థలో సినిమాలు తీస్తే.. పవన్ ఆ రూపేణా టాలీవుడ్‌కు టచ్ లో ఉండొచ్చు. పవన్ స్థానంలో త్రివిక్రమ్ ఆ బాధ్యతలు స్వీకరించొచ్చు. కథలు వినడం, ప్రాజెక్టులు సెట్ చేయడంలో త్రివిక్రమ్ కాస్త దూకుడుగా ఉంటారు. కాబట్టి.. స్నేహితుడితో కలిసి పవన్ ఈ దిశగా అడుగులేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.