తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడి మీద ఉంది. ఎప్పుడూ బయట కనిపించని.. చిన్న చిన్న పార్టీలు కూడా… హడావుడి చేస్తున్నాయి. కేసీఆర్ను ఢీకొట్టేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మహాకూటమిగా మారాయి. సీపీఎం నేతృత్వంలో బీఎల్ఎఫ్ కూడా పోటీకి సిద్ధమయింది. అంతా బాగానే ఉంది కానీ… తెలంగాణ అంటే.. తనకు ఎంతో పిచ్చి అని చెప్పుకునే జనసేనాధినేత పవన్ కల్యాణ్ మాత్రం.. ఇంత వరకూ.. తెలంగాణ ముందస్తు ఎన్నికలపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారు. కనీసం.. ఓ ట్వీట్.. ఓ ప్రెస్ నోట్ ద్వారా కూడా.. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పోషించబోయే పాత్ర గురించి.. వివరించే ప్రయత్నం చేయలేదు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే.. ఏపీలో పోరాటయాత్రను నిలిపివేసి అయినా.. సరే తెలంగాణలో పోరాటయాత్ర చేయాలన్న ఉద్దేశంలో పవన్ కల్యాణ్ ఉన్నారని.. కొద్ది రోజుల కిందట ప్రచారం జరిగింది. దానికి సంబంధించి.. వ్యూహకర్తలతో సమావేశాలు జరిపినట్లు.. ఒకటి, రెండు ప్రెస్నోట్లు కూడా వచ్చాయి. తీరా .. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత పవన్ కల్యాణ్ సైలెంటయిపోయారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధమేనని.. జనసేనాధినేత గంభీరంగా ఎన్నోసార్లు ప్రకటించారు. అనూహ్యంగా అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారు వరకూ వెళ్తే.. జనసేనాధి మాత్రం.. మౌనం పాటిస్తున్నారు. తెలంగాణలో పొత్తు పెట్టుకుందామంటూ.. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. దాదాపుగా బతిమాలినంత పని చేశారు. అదిగో.. ఇదిగో అని.. కనీసం.. సమావేశం కావడానికి కూడా పవన్ కల్యాణ్ సిద్ధపడలేదు.
మరో వైపు ..మళ్లీ ఏపీలో ప్రజాపోరాటయాత్ర ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. అంటే. తెలంగాణ ఎన్నికలను.. పవన్ కల్యాణ్ లైట్ తీసుకున్నారనే అనుమానాలు సహజంగానే అభిమానుల్లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా..? పోటీ చేస్తే.. ఎన్ని చోట్ల పోటీ చేస్తారు..? అభ్యర్థుల్ని ఎప్పుడు ఎంపిక చేసుకుంటారు..? లాంటి మౌలికమైన ప్రశ్నలు చాలా వస్తాయి. వీటిని పట్టించుకోకుండానే పవన్ కల్యాణ్ ఏపీ పర్యటనకు బయలుదేరుతున్నారు. అంటే పవన్ కల్యాణ్ కు .. .తెలంగాణ ఎన్నికలపై తన విధానం.. ప్రత్యేకంగా ఏమీ లేదని భావించడమేనా..? ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటమేనా పవన్ విధానం..? ఇదే నిజం అయితే.. ఏపీలోనూ.. పవన్ కల్యాణ్ ఇబ్బందులు పడతారు. తెలంగాణలో పోటీ చేయడానికి ధైర్యం చాల లేదనే విమర్శలు ఎదుర్కొంటారు. అందుకే తెలంగాణ ఎన్నికల విషయంలో పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది.