సుగాలి ప్రీతి కేసులో ఇప్పుడు జనసేన ముందు కీలక సవాల్ ఉంది. ఈ కేసు విషయంలో బాధితులకు అండగా ఉండి పోరాడింది పవన్ కల్యాణ్. వైసీపీ హయాంలో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కానీ.. ఆ కేసులో విషయం లేదని.. ఇలాంటి కేసులను విచారించేందుకు తమ వద్ద మ్యాన్ పవర్ లేదని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఏ కార్యాచరణ. ప్రకటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
2017లో కర్నూలు పట్టణ శివార్లలోని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ అక్కడ హాస్టల్లో ఉంటున్న సుగాలి ప్రీతి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు సుగాలి ప్రీతిది హత్యే అని ఆరోపించడంతో అప్పటి టిడిపి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాలేజీ యాజమాని, అతని కుమారులను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నా త్వరగానే వాళ్లకి బెయిల్ దొరికింది. ఎన్నికల ప్రచారంలో పవన్ అధికారంలోకి రాగానే కేసును పరిష్కరించి నిందితుల్ని జైలుకు పంపుతామన్నారు.
సుగాలి ప్రీతి కేసు తాము పరిష్కరించాల్సినంత సంక్లిష్టమైన కేసు కాదని, దానికి తగినన్ని వనరులు తమ వద్ద లేవంటూ కోర్టుకు సిబిఐ స్పష్టం చేసింది. తాము వేరే కేసుల్లో బిజీగా ఉన్నామని కూడా చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర ఏజెన్సీలే దర్యాప్తు చేయాల్సి ఉంది. పవన్ కల్యాణ్ ఈ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందున ఆయన నిర్ణయమే కీలకం కానుంది.