రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని రాజ్‌భవన్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను.. మార్చే కీలక.. పరిణామాలకు వేదిక అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా… గవర్నర్ సంప్రదాయంగా ఇచ్చే విందుకు.. అన్ని పార్టీల నాయకులు హాజరవుతూంటారు. బయట ఎక్కడా కలవడానికి అవకాశం లేని నేతలు.. అక్కడ కలిసి.. తదుపరి రాజకీయ కార్యాచరణకు కావాల్సిన.. అడుగులకు ఏర్పాట్లు చేసుకుంటారు. శనివారం రాజ్‌భవన్‌లో అదే జరిగింది. రాజకీయం కోసం కాకుండా… సాధారణంగానే.. కలిసినట్లుగా.. రాజ్‌భవన్‌లో అందరూ కలిసినా.. ప్రతి ఒక్కరూ రాజకీయమే మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే… అక్కడ ఆంధ్రా రాజకీయమే హైలెట్ అయింది. అందరి దృష్టి పవన్ కల్యాణ్‌పైనే ఉంది. ఓ సారి కేసీఆర్.. మరో సారి కేటీఆర్.. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ వరుసగా.. పవన్ కల్యాణ్‌తో మాట్లాడారు. వారేమీ సినిమాల గురించి మాట్లాడరు కాబట్టి… కచ్చితంగా రాజకీయం గురించే మాట్లాడి ఉంటారు.
ఇప్పటికైతే.. రాజకీయవర్గాలు చెబుతున్న ప్రకారం… ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశాన్ని… అటు కేసీఆర్‌తో పాటు.. ఇటు కేటీఆర్ కూడా.. పవన్ కల్యాణ్‌కు వివరించారు. దేశంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు రాబోతున్నాయో.. ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉందో కూడా వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్‌లో ఉంటే.. పవన్ కల్యాణ్‌కు అన్నీ ప్లస్ పాయంట్లేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై గవర్నర్ కూడా.. పవన్ కల్యాణ్ మాట్లాడారని చెబుతున్నారు. రెండేళ్ల క్రితం.. ఎట్‌హోంలో పాల్గొన్న తర్వాతే పవన్ కల్యాణ్… టీడీపీకి వ్యతిరేకమయ్యారు. పవన్ కల్యాణ్‌ను టీడీపీకి దూరం చేస్తే.. టీడీపీ పని అయిపోతుందని.. అప్పట్లో బీజేపీ నేతలు వేసిన ఎత్తుగడతో.. పవన్‌ను గవర్నర్ ద్వారా ట్రాప్‌లోకి వేశారని.. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు గతంలోనే నేరుగా ప్రకటించాయి. చంద్రబాబు కూడా.. గవర్నర్ రాజ్ భవన్ వేదికగా రాజకీయం చేస్తున్నారని… ఆయన వైదొలగాలని డిమాండ్ చేశారు. కానీ.. వీటిపై గవర్నర్ పెద్దగా స్పందించలేదు.
పవన్ కల్యాణ్ కూడా.. ఫెడరల్ ఫ్రంట్ భవితవ్యంపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు. చంద్రబాబును ఓడించడానికి జగన్, పవన్ లను కలిపేందుకు గతంలో గవర్నర్ ప్రయత్నించారన్న వార్తలొచ్చాయి. ఇప్పుడు.. కేసీఆర్ కూడా అదే పనిలో ఉన్నారని చెబుతున్నారు. జగన్‌తో పొత్తు పెట్టుకోవాలని.. తన వద్దకు టీఆర్ఎస్ నేతలు రాయబారానికి వచ్చారని.. పవన్ కల్యాణ్ గతంలోనే చెప్పారు. దానికి సంబంధించి.. ఫెడరల్ ఫ్రంట్ రూపంలో అడుగు ముందుకు పడి ఉండవచ్చని అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్.. ఇప్పటికే కమ్యూనిస్టులతో పొత్తుల చర్చలు జరుపుతున్నారు. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి..!