జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసే ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చాలా నమ్మకంగా చెబతుున్నారు. ఆయన బ్రోకరిజం చేస్తున్నారని టీడీపీని కూడా బీజేపీ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ నేత నారాయణ లాంటి వాళ్లు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. అయినా పవన్ కల్యాణ్ పెద్దగా ఫీలవకుండా మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని చెబుతున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ఏపీ విషయంలో చాలా గందరగోళంగా ఉంది. వైఎస్ఆర్సీపీతో ఉన్న రహస్య సంబంధాలను తెంచుకునేందుకు ఏ మాత్రం ఆసక్తిగా లేదు.
ఏపీలో వైసీపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న పవన్ కల్యాణ్ ఓట్లు చీలిపోకూడదని డిసైడవుతున్నారు. ఓట్లు చీలిపోతే.. రాజకీయం మారిపోతుందని ఆయన అనుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఖచ్చితంగా బీజేపీని కలుపుకోవాలని అనుకుంటున్నారు. బీజేపీకి ఏపీలో ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు. ఒక వేళ పొత్తులు పెట్టుకున్నా..ఉన్న ఆ కొద్ది ఓటు బ్యాంక్ కూటమి పార్టీలకు ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. అయితే కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా బీజేపీ కలిసి రావాలని పవన్ కోరుకుంటున్నారు.
ఏపీలో నాలుగేళ్లలో జరిగిన పాలనలో జరిగిన అవినీతిపై కేంద్రం దర్యాప్తు చేయించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. తమిళనాడులో దర్యాప్తు సంస్థలు దూకుడు చూపుతున్నాయి. అదే తరహాలో ఏపీలోనూ అవినీతిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఏపీలో ఒక్క లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేయిస్తేనే వేల కోట్ల అవినీతి బయటపడుతుందని ఇదంతా ప్రభుత్వ పెద్దల ఖాతాల్లోకి వెళ్లిందని టీడీపీ అంటోంది. అదే సమయంలో వివేకా హత్య కేసులో నిందితుల్ని కూడా కాపాడుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నింటిపై బీజేపీ ఏదో ఓ చర్య తీసుకోకపోతే టీడీపీ .. బీజేపీతో జత కట్టడానికి సిద్ధమయ్యే అవకాశం లేదు.
వైసీపీతో సంబంధాలను కొనసాగించాలని బీజేపీ అనుకుంటే.. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకోదు. అలాంటప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేస్తారన్నది కీలకం. పవన్ కల్యాణ్ ప్రస్తుత టార్గెట్ వైసీపీని ఓడించడం. వైసీపీకి తెర వెనుక బీజేపీ సహకారం ఇస్తుందని ఆయన కూడా అనుకోకుండా ఉండరు. ఇలాంటి సమయంలో పవన్ నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికైతే.. టీడీపీ.. బీజేపీ ముద్ర వేయించుకోవడానికి రెడీగా లేదు.