కీలకమైన నేతలు, అందునా సీఎమ్ అభ్యర్థులు ఎన్నికలలో ఓడిపోతే ఎలా ఉంటుంది? ఆ పార్టీపై, విధానాలపై, నాయకత్వంపై ప్రజలకు నమ్మకం లేదన్న బలమైన సంకేతాల్ని అందిస్తుంటాయి. అందుకే… వాళ్లవాళ్ల స్థానంలో గెలవడానికి అహర్నిశలూ శ్రమిస్తుంటారు. కొంతమంది `ఎలాగైనా గెలిచేస్తాం లే` అంటూ లైట్ తీసుకుంటారు. అది మరీ ప్రమాదం. పాలకొల్లులో చిరంజీవి ఓడిపోవడానికి ఈ నిర్లక్ష్యమే ప్రధాన కారణమైంది.
ఇప్పుడు అదే సీన్ పవన్ కల్యాణ్ విషయంలోనూ రిపీట్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు చోట్ల నుంచీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గాజువాకలో పవన్ విజయం నల్లేరుపై నడకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ భీమవరంలో మాత్రం పవన్‌కి ఊరిపి సలపనంత పోటీ ఉంది. నిజానికి పవన్ రెండు నియోజక వర్గాల్లో పోటీకి దిగడం.. పెద్ద మైనస్. కేవలం భీమవరం నుంచే పోటీకి దిగి ఉంటే.. అక్కడా పవన్ గెలుపు సునాయాసమయ్యేదే. కానీ ముందు జాగ్రత్త చర్యగా గాజువాకనీ ఎంచుకోవడంతో భీమవరం స్థానం ప్రమాదంలో పడింది. పవన్ రెండు నియోజక వర్గాల్లోనూ గెలిస్తే… భీమవరం సీటుని వదులుకుంటాడన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. `పవన్ గెలిస్తే ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. మీ ఓటుని వృథా చేసుకోవద్దు` అంటూ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా పాలకొల్లులో చిరంజీవి నిలబడినప్పుడూ సరిగ్గా ఇలాంటి ప్రచారమే చేసి ప్రత్యర్థులు లబ్దిపోందారు.
పవన్ ని భీమవరంలో గెలవనివ్వకూడదని వైకాపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కుల సమీకరణాల్ని బయటకు తీసుకొచ్చింది. భీమవరంలో క్షత్రియుల ఆధిపత్యం ఎక్కువ. అందుకే ఆ ఓట్లని తమ పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భీమవరంలో ఓటు రూ 2 వేల వరకూ పలుకుతోంది. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న చోట.. ఆ ఓటుకి 5 వేలు కూడా పంచేస్తున్నారు. పవన్‌కి గ్యారెంటీగా పడతాయి అనుకొన్న ఏరియాల్లో ఓటుకి 5 వేలు ఖరీదు కడుతున్నారు. భీమవరం నియోజక వర్గానికి వైకాపా నుంచి భారీగా నిధులు వస్తున్నాయని, ఆ నిధులతోనే ఓట్లని కొనుగోలు చేసే కార్యక్రమం నిర్విరామంగా జరుగుతోందని తెలుస్తోంది. క్షత్రియులతో సమావేశాలు జరిపి.. పవన్‌కి వ్యతిరేకంగా ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ వైకాపా టార్గెట్ గెలవడం కాదు, పవన్‌ని ఓడించడం. ఈ పోరులో టీడీపీకి లాభం జరిగినా ఫర్వాలేనద్న స్థాయిలో వైకాపా ఆలోచిస్తోందంటే పవన్ ఓడిపోవాలని వాళ్లెంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి గండం నుంచి పవన్ ఎలా గట్టెక్కుతాడో చూడాలి.