కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. అందులో పవన్ కల్యాణ్‌కు చోటు దక్కలేదు. కానీ ఆయనతో ప్రచారం చేయించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. పవన్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు అంగీకారం తెలిపారని .. సమన్వయం చేసుకునే బాధ్యతను ఎంపీ, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్యకు అప్పగించారని అనుకున్నారు. అయితే నామినేషన్ల గడువు ముగిసినా పవన్ కల్యాణ్ ప్రచారం గురించి క్లారిటీ రాలేదు. తేజస్వి సూర్య సంప్రదిస్తున్నా పవన్ కల్యాణ్ స్పందించడం లేదని చెబుతున్నారు.
బీజేపీ తరపున ప్రచారం చేయడానికి పవన్ కల్యాణ్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ .. ఏపీలో రాజకీయ పరిణామాల విషయంలో తమ ప్రతిపాదనలు పట్టించుకోనందున పవన్ బెట్టు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న బీజేపీ తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. అదే సమయంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. అదే సమయంలో వ్యతిరేకత కూడా ఎక్కునగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. సర్వేలన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందన్న అంచనాలు వస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ బీజేపీకి ప్రచారం చేసే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు.
కర్ణాటకలో పవన్ కల్యాణ్‌కు పెద్ద ఎత్తు న ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రచారానికి వస్తే జనం విపరీతంగా వస్తారు. ఆయన స్పీచ్‌లు తెలుగు ఓటర్ల మీద ప్రభావం చూపిస్తాయి. కర్ణాటకలో స్థిరపడిన తెలుగు ఓటర్లను ఆకట్టుకోవాలంటే పవన్ లాంటి స్టార్ అవసరం అని గట్టిగా నమ్ముతున్నారు.కర్ణాటకలో బీజేపీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నందున పవన్ లాంటి స్టార్లు అవసరం అని గట్టిగా నమ్ముతున్నారు బీజేపీ నేతలు. మరి పవన్ ఏం చేస్తారో ?