జేఎఫ్సీ.. పూర్తి పేరు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. దీనికి ఆద్యుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆర్భాటంగా.. తన పార్టీ తరపున ఓ జేఎఫ్సిని ఏర్పాటు చేసి స్టార్ హోటల్లో రెండు, మూడు రోజుల పాటు నిపుణులదర్నీ పిలిచి సమావేశాలు పెట్టి… నివేదిక తెప్పించుకుని.. రూ. 75వేల కోట్లు ఏపీకి రావాల్సిందని లెక్క తేల్చి.. సైలెంటయిపోయారు. పవన్ తీరుపై గుస్సా అయిన జయప్రకాష్ నారాయణ.. తాను సొంతంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. స్వతంత్ర నిపుణులతో పని చేయడం ప్రారంభించారు. తాజాగా ఆయన కూడా తన నివేదికను… బయటపెట్టారు.
“ప్రజాస్వామ్య పీఠం” అనే సంస్థ ఆధ్వర్యంలో ఓ నివేదిక తయారు చేశారు. ఇందులో.. మాజీ సీఎస్ అజయ్ కల్లాం కూడా ఉన్నారు. ఆయన ఇటీవలి కాలంలో వైసీపీకి మద్దతుగా.. చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయనతో సహా నిపుణులందరూ.. వివిధ అంశాలపై అధ్యయనం చేసి వివరాలను ప్రకటించారు. తొలి ఏడాది రెవన్యూ లోటు విషయంలో కేంద్రం మోసం చేసిందని నిపుణుల కమిటీ తేల్చింది. రూ. 19వేల కోట్లకు రూ. 4ల కోట్లకు అటూఇటూగా ఇచ్చారని తేల్చారు. పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు కేంద్రం వేగంగా ఇవ్వడం లేదంటున్నారు. ఇప్పటి వరకూ కేంద్రం రూ. 6,727.26 కోట్లు మాత్రమే చెల్లించిందని లెక్కలు బయట పెట్టారు. 2019-20లో కేంద్రం నుంచి పోలవరానికి ఇవ్వాల్సిన మొత్తం రూ. 27,474 కోట్లు కాగా ఇరవై శాతం కూడా… ఇవ్వలేదని నిర్ణయించారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో పోలవరం నిర్మాణం చాలా వేగంగా జరుగుతోందని గుర్తించారు.
వెనుకబడిన ప్రాంతాలకు మూడేళ్లలో 1,050 కోట్లే ఇచ్చారని .. కేంద్ర హామీ ప్రకారం ఏపీకి రూ. 35వేల కోట్ల ప్యాకేజీ విడుదల చేయాల్సి ఉందన్నారు. 11 జాతీయ సంస్థలకు కేంద్రం 12,746.38 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 6.63 శాతం మాత్రమే నిధులు ఇచ్చారన్నారు.
రాజధాని తెలంగాణకు వెళ్లడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. విభజనతో ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో ఏపీ నష్టపోయిందని స్వతంత్ర నిపుణుల కమిటీ తేల్చింది. విభజన చట్టం నిబంధనల వల్ల పన్నుల చెల్లింపు, బకాయిల్లో నష్టం జరిగిందని.. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీ వెనకబడిందని గుర్తు చేశారు. మొత్తంగా… ఏపీకి కేంద్రం నుంచి విభజన హామీల ప్రకారమే.. రూ. 85 వేల కోట్లు రావాల్సి ఉందని తల్చింది. మరి దీనిపై.. పవన్ కల్యాణ్ ఏమైనా స్పందిస్తారా.?