వచ్చే ఎన్నికల్లో సోలోగానే పోటీకి దిగేందుకు జనసేన సిద్ధపడుతున్నట్టుగా ఈ మధ్య పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో మాదిరిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, లేదా భాజపాకి భావసారూప్యంగా పనిచేసే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే, ప్రత్యేక హోదాపై పవన్ గళమెత్తిన దగ్గర నుంచి తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకున్నట్టే! భాజపాతో బాంధవ్యమూ బద్ధలైనట్టే! అయితే, భావసారూప్యత గల పార్టీలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పవన్ కల్యాణ్ చెబుతూ వచ్చారు. సహజంగానే పవన్ కల్యాణ్‌లో వాపక్ష భావజాలం కాస్త కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య వామపక్షాలను పవన్ మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి జనసేన- సీపీఐల మధ్య భావసారూప్యం పెరుగుతోందని చెప్పే పరిణామం తాజాగా చోటుచేసుకుంది.
సీపీఐ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమెల్సీ చంద్రశేఖర్‌తో ఆయన ముచ్చటించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతోపాటు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తదనంత పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. దీంతోపాటు ప్రత్యేక హోదా పోరాటంపై కూడా మాట్లాడుకున్నట్టు చెబుతున్నారు. అయితే, ఇంకోపక్క నారాయణ మాత్రం పవన్ కల్యాణ్‌పై విమర్శలు విసురుతూనే ఉంటారు… కానీ, సీపీఐ నాయకులు మాత్రం పవన్ కల్యాణ్ దోస్తీ కోసం అర్రులు చాచుతున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడేందుకు తమతో కలసి రావాల్సింది గతంలో పవన్‌ను ఈ నేతలు ఆహ్వానించారు. అలాగే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు బంద్‌కి పిలుపునిస్తూ పవన్ మద్దతు కోరారు. అయితే, పవన్ నుంచి స్పందన లేనే లేదు. అదే వేరే చర్చ!
పవన్ కల్యాణ్ కూడా ఈ మధ్య వాపక్షాలకు దగ్గరయ్యేలానే సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. అయితే, ఈ దోస్తీకి అర్రులు చాచడం అనేది కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమా… లేదా, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు చూడాలా అనేది అసలు ప్రశ్న? వాస్తవంలో మాట్లాడుకుంటే… జనసేన ఒక స్థిరమైన అభిప్రాయంపై ఇంతవరకూ నిలబడలేదన్న భావన ఉంది. మొదలుపెట్టిన పోరాటాలను అంతు చూసేవరకూ తీసుకెళ్లిన సందర్భాలూ తక్కువే! అయితే, ఇవన్నీ వాపక్షాలకు తెలియనవి కావు.. వారి విశ్లేషణా దృష్టికి రాని అంశాలూ కావు! అయితే, పార్టీపరంగా చూసుకుంటే వామపక్షాలకు ఆంధ్రాలో అంత పట్టు లేదనే చెప్పాలి. ఎలాగూ భావసారూప్యం అని పవన్ అంటున్నారు కాబట్టి, వామపక్షాలే కాస్త చొరవ తీసుకుని జనసేనకు దగ్గరగా జరుగుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు! వామపక్షాలతో పవన్ దోస్తీ మరింత బలపడితే మంచిదే కదా!