జనసేన అధినేత పవన్ కల్యాణ్… పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని మధ్యలోనే ముగించేసి.. హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో ఆయన సమావేశం అయినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. భేటీ జరిగినట్లుగా అధికారికంగా .. ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఆదివారం రోజు.. ఆయన కేంద్రహోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశమవుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ సమావేశాలన్నీ.. గుప్తమా.. లేక బహిరంగమా అన్నదానిపై జనసేన వర్గాలు ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. కొద్ది రోజుల కిందట.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి ముప్పావుగంట సేపు సమయం కేటాయించారు.
పవన్ కల్యాణ్.. అపాయింట్మెంట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవ్వలేదు. 2014 ఎన్నికలకు ముందు అహ్మదాబాద్ వెళ్లి మోడీని కలిశారు పవన్. ఆయనపై ఇప్పటికీ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే.. బీజేపీ… పవన్ విషయంలో ఒకే ఒక్క క్లారిటీతో ఉంది. పవన్ ను .. జనసేన పార్టీని.. విలీనం చేయాలని కోరుతోంది. దానికి పవన్ సుముఖంగా లేరు. అందుకే.. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్..మళ్లీ బీజేపీ నేతలతో… వివిధ అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అమెరికాలో.. రామ్మాధవ్ కూడా పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ పరిణామాలతో పవన్ కల్యాణ్.. ఢిల్లీ పర్యటన.. ఆసక్తికరంగానే కనిపిస్తోంది.
అమరావతిని తరలించాలనుకునే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తన పలుకుబడితే.. కేంద్రం ద్వారా నిలిపివేయించగలగితే.. అదే పెద్ద విజయమని.. పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. తన వంతు ప్రయత్నాలను ఆయన తీవ్రంగా చేస్తున్నారంటున్నారు. అయితే.. సమావేశాలు రహస్యంగా ఉంచడానికి అటు బీజేపీ పెద్దలు.. ఇటు పవన్ కల్యాణ్.. ఎందుకు ప్రయత్నిస్తున్నారనేది.. చాలా మందికి అర్థం కాని విషయం.