తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను ఒకే సారి షాక్కు గురి చేస్తున్నారు. ఇంత కాలం.. ఏం జరిగినా కనీసం కన్నెత్తి చూడకుండా.. ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా స్పందిస్తున్నారు. ఉద్యోగుల వేతనాల పెంపు దగ్గర్నుంచి ఎల్ఆర్ఎస్ రద్దు వరకూ అదే తంతు. కొత్త ఏడాది సందర్భంగా వేతనాల పెంపును కేసీఆర్ ప్రకటించారు. విధివిధానాలేమీ ప్రకటించకపోయినా కొత్త ఏడాదిలో తాను మంచి చేయబోతున్నాననన్న సందేశాన్ని కేసీఆర్ ఉద్యోగులకు పంపారు.
ప్రభుత్వం ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది నిజం. ఈ విషయం ప్రభుత్వ వర్గాలు కూడా అంగీకరిస్తాయి. అందుకే.. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని చెబుతూంటారు. ఇప్పుడు ఉద్యోగుల అసంతృప్తిని తగ్గించాల్సిందేనని కేసీఆర్ నిర్ణయించారు. సాధారణంగా కేసీఆర్… అన్ని రకాల సమస్యలు పెట్టి… చివరిగా ఒక్క సారిగా వారి సమస్యను పరిష్కరించి… వారితో పాలాభిషేకాలు చేయించుకుంటారు. అయితే అది ఎల్లకాలం నడవదన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారింది. సమస్యలను పరిష్కరించినా.. తమను పెట్టిన బాధలను ఉద్యోగులు గుర్తుంచుకునే పరిస్థితి కనిపిస్తోంది.
కొద్ది రోజుల నుంచి కేసీఆర్ వివిధ వర్గాలు ఉబ్బిపోయే ప్రకటనలు చేస్తున్నారు. ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా చూస్తున్న పీఆర్పీ విషయాన్ని కూడా వెలుగులోకి తెచ్చారు. మామూలుగా అయితే.. కరోనా కాలంలో ఎలాంటి పీఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదని.. సంకేతాలు గతంలో ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయించేశారు. అంతటితో ఆగలేదు.. ఉద్యోగ విరమణ వయస్సును కూడా పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు… వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు వారికీ వరాలు ప్రకటిస్తున్నారు. ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచి..ఆ భారాన్ని ఆర్టీసీ కాకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు.
కేసీఆర్ అనూహ్య నిర్ణయాలపై ప్రజల్లో అనుమానాలున్నాయి. అవి అమలవుతాయా లేదా అన్న సందేహాలున్నాయి. ఎందుకంటే.. కేసీఆర్ ఏ నిర్ణయమైనా కారణం లేకుండా తీసుకోరు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికల నేపధ్యంలో… దిగజారిపోయిన తన రాజకీయ పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి ఈ పాచికలన్నీ వేస్తున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చిన తర్వాతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. స్వయంగా ఈ పరిస్థితిని కేసీఆరే కల్పించుకున్నారు.