ఈ మధ్య భాజపా అమాంతంగా సొంతం చేసుకున్న అంశం… అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు! వచ్చే ఎన్నికల తరువాత రాబోయేది తమ ప్రభుత్వమేననీ, కాబట్టి బాధితులందరినీ ఆదుకుంటామంటూ వరుసగా ధర్మపోరాట దీక్షలు చేసేస్తున్నారు భాజపా నేతలు. శనివారం నాడు విశాఖపట్నంలో కూడా దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి రామ్ మాధవ్, జీవీఎల్, ఏపీ అధ్యక్షుడు కన్నా, సోము వీర్రాజు, పురందేశ్వరి హాజరయ్యారు. ఇక, ఈ వేదిక మీద జీవీఎల్ మైకావేశంతో మాట్లాడారు..! ఆంధ్రాకి కేంద్రం చాలా నిధులు ఇచ్చిందనీ, ఆ లెక్కలు చెప్పమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం లేదని విమర్శించారు. తిత్లీ తుఫాను కోసం కేంద్రం సాయం చేయడం లేదని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారనీ, కానీ ఆంధ్రా ప్రభుత్వానికి విపత్తు నివారణ నిధులను కేంద్రం ప్రతీయేటా ఇస్తుందనీ, వాటిని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో నలభై ఏళ్ల అనుభవం మీకుంటే… ప్రశ్నకు జవాబు చెప్పే సత్తా ఉండాలని ముఖ్యమంత్రిని ఉద్దేశించి జీవీఎల్ అన్నారు! కేంద్రం ఇచ్చిన నిధులకు చెప్పరుగానీ… నిధులు కావాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కి ఈ ప్రభుత్వమే ఒక విపత్తనీ, నిధులన్నీ అడ్డగోలుగా తినేశారు కాబట్టే తాము అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పరని విమర్శించారు.
జీవీఎల్ తో సమస్య ఏంటంటే… ఆయనకి ఆంధ్రా రాజకీయాల్లో అనుభవం లేదు! ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన గతం లేదు, భవిష్యత్తూ కనిపించడం లేదు! పోనీ, ఆయన ఇక్కడున్నదీ లేదు, ఇక్కడి ప్రజల తరఫున పోరాటాలు చేసింది లేదు, రాష్ట్రం సమస్యల్లో ఉన్నప్పుడు అండగా నిలిచింది అంతకంటే లేదు! కానీ, ఇతరుల అనుభవాలని ఆయన ప్రశ్నించేస్తుంటారు! కేంద్రం నిధుల గురించి ఇంతగా గొంతు చించుకుంటారే… హోదా గురించి ఎందుకు మాట్లాడరు..? రైల్వే జోన్ గురించి ఎందుకు ప్రస్థావించరు..? కడప ప్లాంట్, రెవెన్యూ లోటు, వెనకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం… ఇవి కదా మాట్లాడాలి! రాష్ట్రానికి విపత్తు నిధులిచ్చాం, ఇంకోటి ఇచ్చాం అంటారే… అవన్నీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ కేంద్రం ఇచ్చేవే కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపకాలు అనేవి సహజంగానే ఉంటాయి. జీవీఎల్ లాంటివాళ్లు తప్ప… వీటిని ఏపీకి చేసిన ప్రత్యేక సాయంగా ఎవ్వరూ చూడరు..! అనుభవం సంగతి పక్కనపెడితే… రాష్ట్ర కనీస అవసరాలు, సమస్యలపై జీవీఎల్ కి కనీస అవగాహన అయినా ఉందా అనేది పలువురి ప్రశ్న..?