దుబాయ్‌లో ఐపీఎల్ నిర్వహించడానికి రంగం సిద్ధమయింది. కేంద్రం కూడా అనుమతులు ఇచ్చేసింది. ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అయితే.. తాజాగా బాయ్‌కాట్ ఐపీఎల్ అనే నినాదం సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. దీనికి కారణం ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి.. చైనీస్ కంపెనీలను బహిష్కరించకూడదని… నిర్ణయించడమే. గతంలో ఒప్పందాలు చేసుకున్న చైనీస్ కంపెనీల స్పాన్సర్ షిప్లన్నింటినీ కొనసాగించాని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ నిర్ణయించింది. దీంతో.. ఐపీఎల్ టైటిల్… వీవో ఐపీఎల్ గానే కొనసాగనుంది. ఇది … సోషల్ మీడియా దేశభక్తులకు ఆగ్రహం తెప్పించింది.
కొద్ది రోజుల క్రిందట.. చైనా మన సైనికుల్ని చంపేసింది. ఇప్పుడు వారు స్పాన్సర్ చేస్తున్న ఐపీఎల్ చూడటం అవసరమా అంటూ.. బాయ్ కాట్ ఐపీఎల్ నినాదాన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ అనేది… కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారంతో కూడుకుని ఉన్నది. ప్రధానంగా.. స్పాన్సర్ షిప్లే ఆదాయవనరు. ఫ్రాంచైజీలు.. పెద్ద ఎత్తున చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు.. ముఖ్యంగా సెల్ ఫోన్ తయారీ కంపెనీలు స్పాన్సర్లుగా ఉన్నాయి. వాటిని బాయ్ కాట్ చేస్తే.. ఫ్రాంచైజీలకు తీవ్ర నష్టం వస్తుంది. అందుకే.. ఐపీఎల్ చైనా కంపెనీలను దూరం పెట్టేందుకు సాహసించలేదు.
మొదటగా.. గల్వాన్ లోయ ఘర్షణ జరగినప్పుడు.. కల్నల్ సంతోష్ బాబు అమరుడైనప్పుడు.. చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్‌లపై ఆలోచిస్తామని ఐపీఎల్ కీలక వ్యక్తులు ప్రకటించారు. ాకనీ.. అలాంటి ఆలోచన ఇప్పుడు విరమించుకున్నారు. ఇదే అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతోంది. అయితే.. ఇదంతా ఐపీఎల్‌పై పెద్దగా ప్రభావం చూపదనే అంచనా ఉంది. బాయ్ కాట్ చైనా అనే నినాదం ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడే.. చైనా ఫోన్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఐపీఎల్ జరిగినా… రికార్డు స్థాయిలో ప్రజలు చూసే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.