పార్టీ మారిన శాసన సభ్యులపై అనర్హత వేటు.. ఎవరు వేస్తారు..? ఇదో పెద్ద ప్రశ్నగా ఉంటూనే ఉంది. ఒక పార్టీ నుంచి ఎన్నికై… రాజీనామా చెయ్యకుండా అధికార పార్టీలోకి చేరితే ఎవరు చర్యలు తీసుకోవాలి? అధికారంలో ఉన్నవారే కదా. కానీ, తాము ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులు తప్పే అని ఎవరైనా లెంపలేసుకుంటారా..? తెలంగాణలో ఇదే అంశంపై గడచిన ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. ఎన్నికలైపోయాక… ఇప్పుడు మళ్లీ తెరాస ఫిరాయింపులు, మళ్లీ తెరాసపై పోరాటం అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ రాశారు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ నుంచి తెరాసకు వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, దానికి పూర్తి భిన్నంగా నడుచుకోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తెస్తూ, రకరకాల ప్రలోభాలకి గురి చేస్తూ తెరాసలోకి చేర్చుకుంటున్న తీరును ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనీ, కాంగ్రెస్ నుంచి తెరాసలోకి చేరినవారిపై అనర్హత వేటు వెయ్యాలని స్పీకర్ ని కోరామన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
వెంటనే చర్యలు సాధ్యమా..? గత తెరాస ప్రభుత్వంలో ఇది సాధ్యమైందా..? ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించి, వారితో రాజీనామాలు కూడా చేయించకుండా పదవీ హోదాలు కల్పించడమనే విష సంస్క్రుతిని పెంచి పోషించినవారిలో కేసీఆర్ ఒకరు. రాజీనామా చెయ్యకుండా పార్టీ మారినా ఏం ఫర్వాలేదు, ఐదేళ్ల తరువాత ఎన్నికలొస్తాయి, అప్పుడు చూసుకోవచ్చు అనే ధీమా తెలంగాణ సభ్యుల్లో కలగడానికి కారణం తెరాస. పార్టీలు ఏవైనా సరే… ఫిరాయింపులపై ఇలాంటి మెతక వైఖరి సరైంది కాదు. పార్టీలు మారినా, పదవులు దక్కించుకున్నా ఏం ఫర్వాలేదులే అనే ఒక ధీమా నాయకుల్లో కలగడం కచ్చితంగా మంచి సంప్రదాయం కాదు. ఇంకోటి.. టి. కాంగ్రెస్ కూడా ఈ అంశంపై పోరాటానికి పంథా మార్చాలి. స్పీకర్ కి లేఖలు ఇస్తే సరిపోదు. స్పీకర్ హోదాలో ఉన్నవారు సొంత పార్టీకి అతీతంగా వ్యవహరించే రోజులా ఇవీ? కాబట్టి, ఫిరాయింపులపై పోరాటానికి మరో వేదికను అన్వేషించాల్సిన సమయం ఇది. గత ప్రభుత్వంలో బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పుడే స్పీకర్ స్పందించలేదు. ప్రస్తుత పరిస్థితులు తెలిసినవారెవరైనా భట్టి లేఖకు స్పందన ఉంటుందని అనుకుంటారా?