తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆస్పత్రుల బాట పట్టారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించాలని నిర్ణయించారు. కరోనా మహమ్మారి విజృంభించి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో…వైద్య సదుపాలను ప్రభుత్వం కల్పించలేకపోయిందని.. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చలేదని అంటున్నారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో కాంగ్రెస్ నేతలు యాత్ర ప్రారంభించబోతున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కబుధవారం భద్రాచలం నుంచి యాత్రను ప్రారంభిస్తారు. వచ్చే నెల ఐదో తేదీ వరకూ.. దాదాపుగా అన్ని జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రులను సందర్శిస్తారు. నేతలు పర్యటించే ప్రాంతాలంన్నింటిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఇదే అంశాన్ని అస్త్రం గా చేసుకోవాలని ప్లాన్ చేసింది. సీఏల్పీ నేతల పర్యటన కు జిల్లా కాంగ్రెస్ నేతలు సహకరిస్తారా… అనే చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది.
అయితే… అసలు కాంగ్రెస్ నేతలు యాత్ర చేయగలరా.. అనే సందేహం కూడా.. ఉంది. ఎందుకంటే.. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు.. ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం చేపడితే… అడుగు వేయక ముందే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అందుకే.. ప్రజా సమస్యలపై ఎలాంటి పోరాటాలూ చేయలేకపోతున్నారు. ఇప్పుడు.. ఆస్పత్రుల సందర్శకైనా పోలీసులు అనుమతిస్తారా..లేదా ఎక్కడివక్కడ ఆపుతారా.. అన్నది కాంగ్రెస్ నేతల్ని పట్టి పీడిస్తున్న సందేహం.