సినిమా వాళ్లను వాడేసుకుని.. పట్టించుకోవడం లేదని వస్తున్న విమర్శలు ఓ వైపు.. వచ్చే ఎన్నికల్లో టాలీవుడ్ నుంచి ఎవరూ ప్రచారానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్న ఆందోళన మరో వైపు వైసీపీ నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతూంటే.. హఠాత్తుగా కొంత మందికి పదవులు ఇవ్వాలన్న ఆలోచనలోకి వచ్చేశారు. ఈ విషయాన్ని తమ అనుకూల సోషల్ మీడియా సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అలీకి ఓ పదవి.. పోసానికి మరో పదవి ఇస్తారన్న ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. కానీ కన్ఫర్మ్ మాత్రం చేయడం లేదు.
గత ఎన్నికల్లో టాలీవుడ్లో టీడీపీ నేరుగా సపోర్ట్ చేసిన వాళ్లు లేరు. కానీ వైసీపీ కోసం మాత్రం చాలా మంది పెద్ద పెద్ద వాళ్లను కూడా బండబూతులు తిడుతూ అదే వైసీపీకి మద్దతుగా ప్రచారం అన్నట్లుగా చేశారు. వారందరికీ ఇప్పుడు తత్వం బోధపడింది. ఎవరికీ పదవులు రాలేదు. పైగా ఫృధ్వీ లాంటి వాళ్లకు లభించిన ట్రీట్మెంట్ కళ్ల ముందు కనిపిస్తోంది. ఇదిగో పదవి.. అదిగో పదవి అని జగన్మోహన్ రెడ్డి సైతం ఆశ పెట్టిన అలీకి .. మొండిచేయే ఎదురయింది. జగన్ కోసం మెగా ఫ్యామిలీని బండ బూతులు తిట్టిన పోసానికి సినిమా చాన్సులు తగ్గిపోయాయి. ఆయనను కూడా పిలిపించి జగన్ మాట్లాడారు. కానీ ఏ పదవీ రాలేదు.
అయితే ఇప్పుడు వారిద్దరిలో ఒకరికి సలహాదారు పదవి.. మరొకరికి కార్పొరేషన్ పదవి ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ రెండు పదవులూ ఉత్తినే ఉన్నాయని చెప్పుకోవడానికి పనికి వస్తాయి తప్ప విధులు..నిధులు ఉండవు. పైగా ఇంకో ఏడాదిన్నరలో ఎన్నికలు జరుగుతాయి. పదవి కాలం ఉంటే గింటే.. మరో ఏడాదిన్నర మాత్రమే. ఈ మాత్రం దానికి పదవి తీసుకుని ఒక వేళ ప్రభుత్వం మారితే.. అక్కడ జరిగే అవకతవకలకు తాము కేసుల పాలవడం ఎందుకన్న ఆలోచన వారిలో కనిపిస్తోంది. పైగా వీరు గతంలో రాజకీయ ప్రత్యర్థులపై బూతులు ప్రయోగించిన వాళ్లే. తేడా వస్తే కష్టమని వారి ఆందోళన. మొత్తంగా జగన్ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారికి కష్టమన్నట్లుగానే పరిస్థితి ఉంటుంది.