కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతర్గత సమస్యలను చాలా వేగంగా పరిష్కరించుకుంటోంది. అదీ కూడా.. కొత్త సమస్యలు రాకుండా.. ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకునేదిశగా వెళ్తోంది. చాలా రోజులుగా.. కాంగ్రెస్ పార్టీకి సమస్యలుగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు.. వాతావరణం కామ్‌గా మారిపోతోంది. తెలంగాణలో పీసీసీ చీఫ్‌ని నియమించుకోడానికి ఏళ్ల తరబడి ఎదురు చూసి.. అసలు నియమించకపోతేనే.. కాస్తయిన కాంగ్రెస్ పార్టీ ఉంటుందేమో అనుకునే పరిస్థితి నుంచి … బలమైన నేతను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసుకుని ఏ అసంతృప్తి లేకుండా చేసుకోగలిగింది. పంజాబ్‌లోనూ అదే ఫార్ములా పాటించింది. ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి సద్దుమణిగినట్లయింది. రాజస్తాన్‌పై ప్రస్తుతం దృష్టి పెట్టింది.
యువ నేత సచిన్ పైలట్.. సీఎం గెహ్లాట్ మధ్య పరిస్థితుల్ని చల్ల బరిచి… ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపేందుకు సిద్దమయ్యారు. అయితే ఇప్పటి వరకూ ఈ పని చేయలేక మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అధికారాలను సైతం దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడే ఎలా చురుగ్గా వ్యవహరిస్తోందన్నది చాలా మందికి అంతుబట్టని విషయం. కానీ అసలు విషయం మాత్రం… ఇటీవల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడమే కారణం. వరుసగా రాహుల్, ప్రియాంకలతో సమావేశమైన ప్రశాంత్ కిషోర్… కొన్ని కీలకమైన సూచనలు.
సలహాలు ఇచ్చారని.. వాటిని పాటించడంతోనే పరిస్థితి మెరుగుపడిందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో.. పంజాబ్ లో సిద్ధూ విషయంలో పీకే సలహాలను రాహుల్ పాటించారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యను పరిష్కరించుకుని గట్టిగా నిలబడితే… ప్రాంతీయ పార్టీలు కూడా కలిసేందుకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పీకే.. ప్రత్యేకంగా బాధ్యత తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదే నిజం అయితే… ప్రశాంత్ కిషోర్… కాంగ్రెస్ ఫేట్‌ను మారుస్తున్నట్లే అనుకోవాలి.