మోదీకి ప్రత్యామ్నాయ కూటమి కసరత్తును ప్రశాంత్ కిషోర్ ముమ్మరం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి వాటితో పీకేకు సమస్య లేదు. బీజేపీని వ్యతిరేకిస్తున్నా.. ఒకే తాటిపైకి రావడానికి సంకోచిస్తున్న కొన్ని పార్టీలతోనే సమస్య . అలాంటి పార్టీలతో స్వయంగా మాట్లాడేందుకు పీకే రంగంలోకి దిగారు. పవార్‌తో చర్చలు జరిపారు. ఎన్సీపీ సై అనడానికే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో కేసీఆర్‌తోనూ చర్చలు జరుపుతారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు జగన్‌పై పడింది.
జగన్మోహన్ రెడ్డిని కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలోకి తీసుకు వస్తే.. పీకే పెద్ద విజయం సాధించినట్లే అనుకోవాలి. భారతీయ జనతా పార్టీతో ఏ మాత్రం లడాయి పెట్టుకునే పరిస్థితిలో జగన్ లేరు. వీలైనంతగా సహకరించి.. వీలైనంతగా సహకారం పొందే ప్లాన్‌లోనే జగన్ ఉన్నారు. అదే చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. బీజేపీకి వ్యతిరేకంగా జగన్ కూటమిలో చేరతారా అన్నది సందేహమే. అయితే.. ప్రశాంత్ కిషోర్‌పై జగన్‌కు చాలా గురి ఉంది. ఆయన చెబితే.. బీజేపీని వ్యతిరేకిస్తే.. తాత్కాలికంగా సమస్యలు ఎదురైనా.. ముందు ముందు మంచి జరుగుతుందని నమ్మితే.. జగన్ తన స్టాండ్ మార్చుకోవచ్చని చెబుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఏమీ బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన వ్యక్తి కాదు. వాటిలో పుట్టి పెరిగిన వ్యక్తి కాదు. నిజం చెప్పాలంటే ఆయనది కాంగ్రెస్ రక్తం. అవసరాల కోసం.. బీజేపీతో సంబంధాలు నెరపకతప్పడం లేదు. అదే.. బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని అనుకున్నప్పుడు… ఆయన కూడా.. లెక్క చేయడం మానేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు…, బీజేపీకి గడ్డు పరిస్థితి వచ్చిందని.. జగన్‌ను నమ్మించాల్సి ఉంది. మోడీ కన్నా.. పీకేను జగన్ ఎక్కువగా నమ్మితే… మోడీ వ్యతిరేక కూటమికి బలం లభించినట్లే చెప్పుకోవచ్చు.