ఒక్కో సినిమాకి ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది. చిన్న సినిమాలకు పనికొచ్చే స్ట్రాటజీలు పెద్ద సినిమాల విషయంలో పల్టీ కొడుతుంటాయి. బలగం సినిమానీ, శాకుంతలం సినిమానీ ఒకేలా చూడకూడదు. రెండూ వేర్వేరు సినిమాలు, వేర్వేరు జోనర్లు. అందుకే జనాల్లోకి ఈ సినిమాని తీసుకెళ్లే విధానాలు కూడా వేర్వేరుగానే ఉంటాయి. కానీ..ఈ రెండు సినిమాల్నీ ఒకే దృష్టితో చూసి బోల్తా పడ్డాడు దిల్ రాజు.
బలగం అనే సినిమా వచ్చింది. అది చిన్న సినిమా. స్టార్లు లేరు. పబ్లిసిటీకి బడ్జెట్ లేదు. అందుకే ప్రీమియర్లు వేశారు. విడుదలకు ముందే… ఆ సినిమా గురించి జనం మాట్లాడుకొనేలా చేశాడు. అది వర్కవుట్ అయ్యింది. సినిమా చూసినవాళ్లంతా పాజిటీవ్‌గా స్పందించారు. మంచి రివ్యూలు వచ్చాయి. దాంతో ఆటోమెటిగ్గా సామాన్య ప్రేక్షకుడికి కూడా ఈ సినిమా చూడాలన్న కుతూహలం పెరిగింది.
ఇప్పుడు శాకుంతల విడుదల అయ్యింది. దీనికి స్టార్ బలం తోడుగా ఉంది. పెద్ద బడ్జెట్ సినిమా. కానీ దీనికీ బలగం లెక్కలే వేశాడు దిల్ రాజు. ఈ సినిమా ప్రివ్యూ షోలు ఏర్పాటు చేశాడు. విడుదలకు 4 రోజుల ముందే ప్రివ్యూలు పడ్డాయి. అయితే టాక్ దెబ్బ కొట్టింది. చూసినవాళ్లెవ్వరికీ సినిమా నచ్చలేదు. దాంతో.. నెగిటీవ్ టాక్ స్పైడ్ అయ్యింది. మీడియాకు కూడా ఓ రోజు ముందే ప్రివ్యూ పడింది. దాంతో.. సినిమా జాతకం 24 గంటల ముందే బయటపడిపోయింది. ఇవన్నీ ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించాయి. శాకుంతలం ఓపెనింగ్స్ దారుణంగా ఉండడానికి ఓ రకంగా ప్రీమియర్లే కారణమయ్యాయి. నిజానికి ఈ సినిమాకి భారీ ప్రమోషన్లు అవసరం. ఈ సినిమా చూడాలన్న కుతూహలాన్ని ప్రేక్షకుల్లో కలిగించడం ఇంకా అవసరం. అవి రెండూ చేయలేకపోయింది చిత్రబృందం. దాంతో.. ఓపెనింగ్స్ రాలేదు. దాదాపు 70 కోట్లతో తీసిన సినిమా ఇది. ఓపెనింగ్స్ ఇంత పేలవంగా ఉంటే సినిమాకి దెబ్బ పడిపోయినట్టే. నిజానికి ఈ సినిమా ప్రివ్యూలు వేయడం గుణశేఖర్‌కి ఇష్టం లేదట. కేవలం దిల్ రాజు బలవంతంపై గుణ శేఖర్ ఈ ప్రివ్యూలకు ఒప్పుకొన్నాడని టాక్. హైదరాబాద్ లోనే కాకుండా మిగిలిన ప్రధాన నగరాల్లోనూ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. కానీ.. చివరి నిమిషంలో వాటిని రద్దు చేశారు. లేదంటే.. మరింత నష్టం జరిగేదేమో?