ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టిందా..? ఈమేరకు కేంద్ర సర్కార్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను పురామయిస్తోందా..? బీజేపీ కుట్రలను పసిగట్టే ముఖ్యమంత్రి పదవికి ముందే రాజీనామా చేయాలని అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఆప్ వర్గాలు.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈమేరకు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ను పదవి నుంచి తప్పించేలా కేంద్రం తెరవెనక గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీ రాజకీయాలను అంచనా వేసిన అరవింద్ కేజ్రీవాల్.. అంతకుముందే తనే పదవి నుంచి తప్పుకొని తన భార్యను సీఎం చేయాలనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ను తప్పించాలని బీజేపీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఈమేరకు పిల్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.అరెస్ట్ అయ్యాక సీఎం పదవిలో కొనసాగాలా వద్దా..? అనేది కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయమని.. తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్రపతి లేడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను సంప్రదించాలని సూచించింది.
అదే సమయంలో ఢిల్లీ సర్కార్ టార్గెట్ గా లెఫ్టినెంట్ గవర్నర్ రాజకీయ విమర్శలు కూడా స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్ పై ఉందని మండిపడారు. ఆప్ ను బద్నాం చేసేందుకు ఢిల్లీ గవర్నర్ ద్వారా బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రబుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి అతిషి కూడా తెలిపారు. ఈమేరకు అధికారులను ప్రభుత్వ సమావేశాలకు వెళ్ళకూడదనే ఆదేశాలు వెళ్లాయని ఆరోపించారు. ఢిల్లీలో ప్రభుత్వం గాడితప్పినట్టు ముద్రవేసి ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించే వ్యూహంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దీంతో ఢిల్లీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.