దక్షిణాదిలో సరైన నాయకత్వం లేక కొట్టుకుంటున్న కాంగ్రెస్ నాయకత్వాన్ని గాడిలో పెట్టి..పార్టీని బతికించుకునే ప్రయత్నాలను ప్రియాంకా గాంధీకి అప్పగించాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ పదవి ఆమెకు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి.. ప్రాంతీయ పార్టీల మధ్య పోరు నడుస్తోంది. దక్షిణాదిలోనూ బలంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ బలహీనపడుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లి అధికారం దక్కించుకోవడంలో రెండు సార్లు విఫలం కావడమే కాకుండా ఇప్పుడు మరింతగా బలహీనమవుతోందన్న అభిప్రాయాలు కాంగ్రెస్ మీద వస్తున్నాయి. దీంతో స్వయంగా ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే కేరళలో వరుసగా రెండో సారి అధికారాన్ని కోల్పోయింది. అక్కడ మరోసారి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో అధికారపార్టీ కూటమిలో భాగస్వామిగా ఉంది. కర్ణాటకలో త్వరలో ఎన్నికలుజరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి చాన్సులు ఉన్నాయని భావిస్తున్న తరుణంలో పార్టీ హైకమాండ్ తరపున బలమైన నాయకుడు వ్యవహారాలు పర్యవేక్షిస్తే.. ఇబ్బంది లేకుండా ఉంటుందన్న అంచనాలు పార్టీ పెద్దల నుంచి వచ్చాయి. ఈ కారణంగా ప్రియాంకా గాంధీ కూడా దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రియాంకా గాంధీ ఇప్పటి వరకూ యూపీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బాధ్యతలు తీసుకున్నారు.
ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక ముంచుకొస్తోంది. వచ్చే ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం అంతా రచ్చ రచ్చగా ఉంది. ప్రియాంకా గాంధీ ఎంట్రీతో వీటన్నింటికీ చెక్ పెట్టే అవకాశం ఉందని అనుకోవచ్చు.