కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు అనారోగ్య కారణాలతో ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ… ఒక్కడే పార్టీని నడపడం కూడా కష్టమే. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ బరిలోకి దిగుతారన్న ప్రచారం ఆ పార్టీలో ఊపందుకుంటోంది. ప్రియాంకాగాంధీ 2019 ఎన్నికల్లో రాయ్ బరేలీ లేదా వారణాసి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. రాయ్‌బరేలీ కంటే వారణాసి వైపే ప్రియాంక మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీని ఓడించి… తన రాజకీయ ఆరంగేట్రాన్ని ఓ రేంజ్లో చాటాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పార్టీ నేతలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆమె ఎక్కడ పోటీ చేయాలనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దానితో రెండు నియోజకవర్గాలు పార్టీ నేతల మధ్య నానుతున్నాయి. వారణాసి విషయంలో ప్రియాంక కూడా ఆసక్తి చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని పార్టీ శ్రేణులు డిమాండ్లు చేశాయి. ఒక్కో రాష్ట్రం చేజారుతున్న కొద్దీ ఆ డిమాండ్లకు మరింత బలం చేకూరింది. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ నడిపించలేకపోతున్నారని పార్టీలో గుసగుసలు పెరిగాయి. ప్రియాంక వస్తే వ్యూహాలు మారతాయని, రాహుల్ కంటే కూడా ఆమె వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే వీలుంటుందని నమ్ముతున్నారు.
రాహుల్ పొజిషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రియాంక క్రీయాశీల పాత్ర పోషించడమే సరైన మార్గమని పార్టీ నేతలు అంటున్నారు. నిన్నమొన్నటి వరకు సోనియా పార్టీ అధ్యక్షురాలిగా ఉంటే, రాహుల్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అచ్చం నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలతో ఉండే ప్రియాంకకు అటు యూత్ తో పాటు పెద్దల్లో కూడా క్రేజ్ ఉంటుందని కాంగ్రెస్ లో ఒక వర్గం వాదిస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా ఉంటూ తర్వాతి కాలంలో పార్టీకి దూరమైన ఓటర్లు మళ్లీ పార్టీ వైపుకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నమ్ముతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ భవిష్యత్‌కు అత్యంత కీలకమైనవి కావడంతో.. ప్రియాంక రంగంలోకి దిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు.