పోలవరం ఎత్తు తగ్గించారంటూ వైసీపీ రెండు రోజులుగా గగ్గోలు పెడుతోంది. మీడియా..సోషల్ మీడియాతో పాటు పార్లమెంట్ మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి వంటి వారు కూడా మాట్లాడారు. దీనికి కారణం ఉంది. పోలవరం ప్రాజెక్టులో కేంద్రం 41.15 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం నిధులు కేటాయించింది. పోలవరం అసలు ఎత్తు 45.72 మీటర్లు. అంతే నిర్మించారు. అంతే తగ్గింపు అన్న అవకాశం ఉండదు. కానీ నీటి నిల్వను మాత్రం… ఇప్పటికి41.15 మీటర్ల వరకూ చేయడానికి అవసరమైన ఆర్ అండ్ ఆర్ ను చెల్లిస్తారు. ఈ అంశంపై వైసీపీ అదే పనిగా విమర్శలు చేస్తోంది.
నిజానికి పోలవరం తొలి దశ అనే మాటను తీసుకు వచ్చింది వైసీపీ. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టులో పనులు జరగకుండా చేశారు. నిర్వాసితులకు ఒక్కొక్కరికి ఇచ్చే దాని కన్నా పది లక్షలు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టారు. చివరికి ఏమీ చేయలేదు. ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయలేక.. చివరికి తక్కువ ఎత్తు వరకు నీళ్లు నిలుపుతామని జగన్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పెట్టింది. పోలవరం ప్రధాన డ్యాం ఎత్తును తొలి దశలో 41.15 మీటర్లకు ప్రతిపాదించింది జగన్ ప్రభుత్వమేనని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టంగా ప్రకటించింది.
కనీస ఆలోచన చేయకుండా తొలి దశ అంటూ వైసీపీ ప్రారంభించిన నాటకం 2021లో ప్రారంభమయింది. అప్పుడు పంపిన ప్రతిపాదనను 2023లో కేంద్రంతో ఆమోదించ చేసుకున్నారు. ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు.. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 196.40 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు వైసీపీ హయాంలో కుదించారు. ఇప్పుడు దానికే కేంద్రం నిధులు కేటాయించింది. కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయడంతో సవరించిన అంచనాలకు ఆమోదం లభించింది. ముందుగా ప్రాజెక్టు పూర్తయి.. కొంత మేర అయినా నీళ్లు నిలుపుకుంటే ఆ తర్వాత ఆర్ అండ్ ఆర్ ఇచ్చి మిగిలిన మొత్తాన్ని నీళ్లు నిలుపుకోవచ్చు.
సాంకేతికంగా పోలవరం ఎత్తు తగ్గింపు అనే ప్రశ్నే రాదు. కానీ నీళ్లుఎంత నిల్వ చేయాలన్న ప్రశ్న వస్తుంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇప్పుడు చాలా ఖర్చుగా మారాయి. అందుకే.. మెల్లగా ముందుగా ప్రాజెక్టు అమల్లోకి వస్తే ఆర్థిక వెసులుబాటును బట్టి నీటి నిల్వను పెంచుకుంటారు. అయితే తాము చేసిన తప్పులను.. కూటమి ప్రభుత్వంపై వేసి .. తప్పుడు ప్రచారం చేయడంలో వైసీపీకి ఓ మార్క్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు పోలవరం విషయంలో చూపిస్తున్నారు.