అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘పుష్ప 2’ వచ్చేసింది. ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది? బాలీవుడ్ లో ఎంత సాధిస్తుంది? అనే లెక్కలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈవారం అంతా బాక్సాఫీసు దగ్గర పుష్ప జాతర మాత్రం నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు అందరిలో తొలుస్తున్న ప్రశ్న.. ‘పుష్ప 3 ఉంటుందా? లేదా? అని.
ఎండ్ కార్డ్ లో ‘పుష్ప 3’ ఉంటుందంటూ చిత్రబృందం ప్రకటించింది. పుష్ప 1 ది రైజ్, పుష్ష 2 ది రూల్ అయితే.. పుష్ప 3… ది ర్యాంపేజ్ అన్నమాట. సుకుమార్, మైత్రీ మూవీస్ సంస్థలకు ఈ సినిమాకి పార్ట్ 3 తీసే ఆలోచన ఉంది. కాకపోతే.. ఇప్పట్లో సాధ్యం కాకపోవొచ్చు. అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్ చేయాలి. అందుకు కాస్త సమయం పట్టేట్టు ఉంది. 2025 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. చాలా పెద్ద కాన్వాస్ ఉన్న సినిమా ఇది. పూర్తయ్యేటప్పటికి 2 యేళ్లు పట్టొచ్చు. ఆ తరవాత బన్నీ పూర్తి చేయాల్సిన కమిట్మెంట్స్ ఉన్నాయి. అంటే కనీసం నాలుగేళ్ల వరకూ పార్ట్ 3 పై ఫోకస్ చేయలేడు.
మరోవైపు పార్ట్ 3 అనేది టెక్నికల్ గానూ కష్టమే. ఎందుకంటే పుష్ప కథ.. పార్ట్ 2తోనే అయిపోయింది. ఇంటిపేరు తెచ్చుకోవడం అనేది పుష్ప టార్గెట్. అది ఎచీవ్ అయిపోయాడు. ఇక కథలో కాన్ఫ్లిక్ట్ ఏముంది? పార్ట్ లోనూ సీఎమ్ సీటు కోసం బన్నీ చేసిన రాజకీయం అనే కాన్సెప్టు లేకపోతే.. కథ లేదు. పార్ట్ 3 చేయాలంటే కొత్త కాన్సెప్టు, కొత్త కాన్ఫ్లిక్ట్ ఎంచుకోవాలి. అవి చేసే బదులుగా ఓ కొత్త కథ రాయొచ్చు. ఇప్పటికే పుష్పరాజ్ అవతారం, అతని ప్రపంచాన్ని రెండుసార్లు చూసేశారు ఫ్యాన్స్. మూడోసారి కూడా ఇంతే కిక్, ఇదే బజ్ వస్తుందని ఆశించలేం. సుకుమార్ దగ్గర కూడా చాలా కథలు, ఆలోచనలు పెండింగ్‌లో ఉండిపోయాయి. అవన్నీ మెల్లమెల్లగా చేసుకోవాల్సిందే. వాటి మధ్య ‘పుష్ప 3’ కోసం సుకుమార్ టైమ్ కేటాయించడం కష్టమే అనిపిస్తోంది.