వంగవీటి రాధా భవితవ్యం డోలాయమానం లో పడింది. రాధా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టిక్కెట్ ఆశిస్తుండగా, జగన్ ఆ టికెట్ మల్లాది విష్ణు కి ఇవ్వబోతున్నట్టు, రాధా ని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని అడిగినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, రాధా అలకబూనారు. ఎలమంచిలి రవి, కొడాలి నాని తదితరులు రాధా తో భేటీ అయినప్పటికీ రాధా మెత్తబడ్డ లేదని తెలుస్తోంది. అయితే రాధా కి ఈసారి సొంత సామాజిక వర్గం పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రత్యేకించి అభిమానులే కొన్ని ప్రశ్నలతో ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
గతంలో వైఎస్సార్ సీపీ పార్టీకే చెందిన గౌతమ్ రెడ్డి వంగవీటి రంగా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రంగాన్ని పాము తో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. పార్టీ కూడా గౌతమ్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ గౌతమ్ రెడ్డి పార్టీలో కి తిరిగి వచ్చి, మళ్లీ మునుపటిలా గానే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే గౌతమ్ రెడ్డి పార్టీలోకి తిరిగి వచ్చినప్పుడే, వంగవీటి రాధా జగన్ పై అసమ్మతి రాగం మొదలు పెట్టి పార్టీ నుంచి బయటకు వచ్చి ఉంటే ఆ పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
అలాగే, కృష్ణా జిల్లాలో పర్యటన సందర్భంగా జగన్, ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాం అని ప్రకటించాడు. అయితే అనూహ్యమైన రీతిలో ఆ ప్రకటన పై వ్యతిరేకత రావడంతో మళ్లీ దానికి సంజాయిషీ ఇచ్చుకున్నారు. మొత్తం జిల్లాకు కాదని, జిల్లాను రెండుగా విభజించి ఒక దానికి మాత్రమే ఎన్టీఆర్ పేరు పెడతాం అని ” కవర్ డ్రైవ్ ” చేయబోయారు. అయితే అప్పుడు కూడా వంగవీటి రాధా మిన్నకుండిపోయారు. తన అభిమానుల కోరిక మేరకు అప్పుడు గళమెత్తినా కూడా పరిస్థితి మరోలా ఉండేదని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు అంటున్నారు.
ఇక ఆ తర్వాత జగన్ కాపు రిజర్వేషన్లపై మెలిక పెట్టినప్పుడైనా రాధ మాట్లాడి ఉండవలసిందని , అప్పుడు బయటికి వచ్చి ఉన్నా, తన సొంత సామాజిక వర్గంలో ఆయన ఇమేజ్ మరొక లా ఉండేదని వారంటున్నారు.
కానీ, ఆ మూడు సందర్భాలలోనూ బయటకి రాకుండా , గళం ఎత్తకుండా మిన్నకుండిపోయి, ఇప్పుడు కేవలం తనకు కావలసిన టికెట్ రాలేదని పార్టీ నుంచి బయటకు రావడాన్ని ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్లతో పాటు సొంత అభిమానులు కూడా తప్పు పడుతున్నారు.
మరి ఈ నేపథ్యంలో రాధా భవితవ్యం ఎలా ఉంటుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది