ఆంధ్రప్రదేశ్‌లో శవాసనం వేసి ఉన్న కాంగ్రెస్ పార్టీని తిరిగి లేపి నిల్చోబెట్టడం ఎలా? అనే విషయంలో ఆ పార్టీ నాయకులు ఆశలు వదలుకోవడం లేదు. తమ ప్రయత్నాలు మానడం లేదు. పునరుజ్జీవింపజేయడం తర్వాత.. కనీసం పార్టీని దిష్టిబొమ్మ లాగా అయినా సరే.. లేపి నిల్చోబెట్టగలిగితే.. తర్వాతి సంగతి తర్వాత చూసుకోవచ్చు అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు పాపం.. తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ కూడా వారికి తన వంతు చేయూత అన్నట్లుగా రెండుసార్లు అనంతపురానికి కూడా వచ్చి వెళ్లారు. ఇలాంటి నేపథ్యంలో గురువారం ఉదయం రాహుల్‌తో రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు కీలక భేటీ కానుండడం ఆసక్తికరంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో వేర్వేరు కారణాల నేపథ్యంలో తెదేపా, వైకాపాలు పెద్దగా స్పందించే పరిస్థితిలో లేని వాతావరణాన్ని తాము క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇదేవిషయాన్ని పార్టీ నాయకులు రఘువీరా ద్వారా అధినేత రాహుల్‌గాంధీకి నివేదించాలనుకుంటున్నారు. రాహుల్ ద్వారా పార్లమెంటులో ప్రత్యేకహోదా అంశాన్ని తీవ్రస్థాయిలో వినిపించడం ద్వారా రాష్ట్రంలో పార్టీని బతికించుకోవచ్చుననేది వారి ఆశ. గురువారం ఉదయం రాహుల్‌తో భేటీ అయి, ప్రత్యేకహోదా గురించి పోరాటానికి సారథ్యం వహించాల్సిందిగా, పార్లమెంటు వెలుపల కాకుండా, పార్లమెంటులోపల ఉండి పోరాటం చేయాల్సిందిగా వారు కోరబోతున్నారు.
అయితే రాహుల్‌గాంధీ… ఏదో ఏపీ గడ్డమీద అడుగుపెట్టిన సందర్భాల్లో ఏ రోటి కాడ ఆ పాట పాడినట్లుగా.. అప్పుడు హోదా గురించి మాట్లాడడం తప్ప.. ఢిల్లీ వెళ్లాక ఆ విషయాన్ని ఇప్పటిదాకా ప్రస్తావించనే లేదు. రఘువీరా కేవీపీలు 14, 15 తేదీల్లో తాము చేపట్టదలచుకుంటున్న ఆందోళనల్లో రాహుల్‌ను కూడా భాగం పంచుకోమని కోరే అవకాశం ఉంది. అయితే రాహుల్ ఈ ప్రత్యేక హోదా కోసం ప్రత్యక్ష ఉద్యమానికి తాను ఒప్పుకుంటాడా లేదా.. వీరి విజ్ఞప్తులను బుట్టదాఖలు చేస్తాడా అనేది మాత్రం తెలియడం లేదు. ఎటూ భేటీ అయిన తర్వాత.. నాయకులు బయటకు వచ్చి.. ”హోదా కోసం పోరాటానికి పూర్తి మద్దతు ఇవ్వడానికి రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. పార్టీ మొత్తం ఏపీకి ప్రత్యేకహోదా సాధించే ఉద్యమానికి వెన్నంటి ఉంటుందని చెప్పారు..” అంటూ చిలక పలుకులు పలుకుతారు. కానీ ఆ మాటలు కాదు.. క్రియాశీలంగా.. రోహిత్ వ్యవహారాన్నో, కన్న య్య వ్యవహారాన్నో నెత్తికెత్తుకున్నట్లుగా రాహుల్ ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కూడా నెత్తికి ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? అనేది కీలకం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.