కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా ఒక బహిారంగ సభలో మాట్లాడారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గిందనీ, రాహుల్ నాయకత్వ పటిమపై ఇక్కడి ఫలితాలు ప్రభావితం చూపుతాయనే విశ్లేషణలూ విమర్శలూ చాలానే వచ్చాయి. ఈ నేపథ్యంలో రాయ్పూర్ లో జరిగిన బహిరంగ సభలో భాజపాపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు అర్థవంతంగానే ఉన్నాయి. వాటిని ప్రచారాస్త్రంగా మార్చుకుంటే… మోడీని ఎదుర్కోవడానికి కావాల్సిన ప్రధానాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
కర్ణాటకలోని చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉద్దేశించి మాట్లాడుతూ… దేశంలో ఒక భయానకమైన వాతావరణాన్ని భాజపా, ఆరెస్సెస్ లు సృష్టిస్తున్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండూ కలిసి దేశంలోని అన్ని రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలన్నింటినీ చెరపడుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందన్నారు. పాకిస్థాన్ లేదా, నియంతృత్వ ప్రభుత్వాలున్న దేశాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో శాసనసభ్యులంతా ఒకవైపు ఉంటే, గవర్నర్ మరోవైపు ఉంటూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొంతమంది భాజపా ఎంపీలు సుప్రీం కోర్టు జడ్జిలు మాదిరిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కర్ణాటకలో భాజపా అనుసరిస్తున్న రాజకీయాన్ని దేశమంతా చూస్తోందన్నది వాస్తవం. గోవా, మేఘాలయ, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా అధికారం కోసం భాజపా వేసిన ఎత్తులూ జిత్తులూ ప్రజలు చూశారు. కానీ, కర్ణాటకలాంటి పెద్ద రాష్ట్రంలో కూడా బహిరంగంగానే బేరసారాలు జరుపుతున్న తీరు, భాజపాకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై మేధావులతోపాటు సామాన్యుల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఎలాగైనా ఫర్వాలేదు, రూల్స్ ని ఎట్నుంచి ఎటు మార్చేసినా ఏమీ కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలు అనే స్థాయి అధికార దాహంతో భాజపా వ్యవహరిస్తోంది. విపక్ష పార్టీగా ఈ అంశాన్ని ప్రధాన ప్రచారస్త్రంగా చేసుకుంటే… కాంగ్రెస్ కి బాగా ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. నిజానికి, కాంగ్రెస్ హయాంలో పాలనా ఇతర అంశాలూ ఎలా ఉన్నా… ఈ తరహా అధికార దాహంతో ఒక అధికార పార్టీగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ఆ తేడాను రాహుల్ గాంధీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలించే అంశం అవుతుంది.