భారతీయ జనతాపార్టీలో కొంత మంది తెలుగువాళ్లు…కీలకమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్లు దశాబ్దాల కిందటే… ఏపీని వదిలి పెట్టి వెళ్లిపోయినా… ఢిల్లీలో ఉండి.. బీజేపీలో ఓ స్థానాన్ని సంపాదించుకోగలిగారు. వారిలో మొదటి వ్యక్తి రామ్‌మాధవ్. ఆరెస్సెస్‌లో అత్యంత కీలకంగా వ్యవహరించి.. ఏకాఎకినా బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిపోయారు. అమిత్ షా తర్వాత ఆయనే బీజేపీ అధ్యక్షుడని చెబుతూ ఉంటారు. ఇక జీవీఎల్ నరసింహారావు. సెఫాలజిస్ట్‌గా బీజేపీకి ఫేవర్‌గా ఉండి.. ఆ పార్టీ నేతలతో సాన్నిహిత్యం పొంది.. బీజేపీలో అధికార ప్రతినిధి పదవి పొందారు. ఏపీలో ఏదో చేస్తారన్న ఉద్దేశంతో ఆయనను యూపీ నుంచి ఎంపీ చేసి… ఆంధ్ర మీదకు వదిలేశారు బీజేపీ అగ్రనేతలు.
కేంద్రంలో అధికారం ఉండటమే బలమా..?
విభజన హామీలు నెరవేర్చకపోవడం కావొచ్చు.. వైసీపీ, జనసేనతో రహస్య బంధం ఏర్పర్చుకుని.. తమ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారనే కుట్ర జరుగుతున్న విషయం తెలుసుకుని కావొచ్చు.. టీడీపీ అధినేత.. చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత బీజేపీపై ..ఓ స్థాయిలో దాడి చేస్తున్నారు. చంద్రబాబు చెప్పే ఏ అంశంపైనైనా.. అది విభజన హామీలు కావొచ్చు.. నిధుల విషయం కావొచ్చు.. పోలవరం ప్రాజెక్ట్ కావొచ్చు… దేనిపైనా… బీజేపీ నేతలు సూటిగా సమాధానం చెప్పలేదు. చెప్పలేరు కూడా. ఎందుకంటే ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం ఎంత నిజమో..? … రాజ్యాంగ పరంగా రావాల్సినవి తప్ప… ఇవ్వాల్సిన నిధుల కంటే.. ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకపోవడం అంతే నిజం. అందుకే అటు రామ్‌మాధవ్, ఇటు జీవీఎల్… ఇద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు చేసి తప్పించుకుంటున్నారే తప్ప… ఏ ఒక్క అంశంలోనూ తమను తాము సమర్థించుకోలేకపోతున్నారు. తాము కేంద్రంలో ఉన్నాం కాబట్టి.. తాము చంద్రబాబు కన్నా బలవంతులమన్నట్లు వ్యవహరిస్తున్నారు.
అవినీతి ఉంటే బెదిరింపులేనా..? చర్యలు తీసుకోరా..?
పీడీ అకౌంట్ల దగ్గర్నుంచి… రాజధాని బాండ్ల వరకూ.. జీవీఎల్ నరసింహావు.. ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ అవినీతి వెదికారు. రోజుల కొద్దీ టీవీల్లో చర్చలు పెట్టారు. చేసినన్నీ ఆరోపణలు చేశారు. ఐటీ, ఈడీ దాడులను దగ్గరుండి చేయిస్తున్నారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. ఏపీ అధికారులు అయితే.. తమ మాట వినరని..నేరుగా.. ఉత్తరప్రదేశ్ నుంచి ఐటీ అధికారులను తెచ్చి మరీ సోదాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పుకున్నారు. ఇన్నీ చేసినా ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు. అదే సమయంలో… కేంద్రంలోని కొన్ని ప్రభుత్వ శాఖలు.. ప్రభుత్వ పనితీరును మెచ్చుతూ సర్టిఫికెట్లు పంపుతున్నాయి. అయినా సరే… రామ్‌మాధవ్ , జీవీఎల్ ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. వీకెండ్స్‌లో ఏపీకి .. వచ్చే రామ్‌మాధవ్… నిన్న మరోసారి.. అలాగే…వచ్చి చంద్రబాబు సంగతి తేలుస్తామన్నట్లు హెచ్చరికలు చేశారు. ఏపీలో మరుగుదొడ్ల నిధులను కూడా వదల్లేదని మీరు అవినీతికి పాల్పడుతుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించేశారు. కేవలం… అధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నంత మాత్రం కేంద్రం తరపున… హెచ్చరికలు జారీ చేసేస్తారా…?
ఏపీ అంటే.. రామ్‌మాధవ్ , జీవీఎల్‌కు ఎంత అలుసో..?
కేంద్రం నిధులు ఇవ్వకపోతే మీ దగ్గర డబ్బులు ఎక్కడివి? అని రామ్‌మాధవ్ ఏపీని తేలికగా తీసి పడేస్తున్నారు. చంద్రబాబు అవినీతితో కేంద్ర నిధులు ప్రజలకు పూర్తిగా అందడం లేదట. కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అసలు ఏపీకి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పోతున్న పన్నులెన్ని..? ఏపీకి తిరిగి ఇస్తున్నవెన్ని..?. ఏపీ నుంచి కేంద్రానికి రూపాయి పోతుంటే.. కనీసం అరవై పైసలు కూడా తిరిగి రావడం లేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు.. ఎవరు ఎవరికి ఇస్తున్నట్లు. తమ జేబులో సొమ్మేదో ఏపీకి ఇస్తున్నట్లు… అవి కూడా ఆపేస్తామన్నట్లుగా ఎందుకు బెదిరిస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు.
జీవీఎల్, రామ్‌మాధవ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవగలరా..?
చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాయావతిని కలవడం.. రామ్‌మాధవ్ కు కోపం తెప్పించిట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ప్రయత్నిస్తున్నారంటూ…చంద్రబాబు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకో చూద్దామంటూ.. హెచ్చరికలు పంపుతున్నారు. చంద్రబాబు ఏం చేసినా… అంతిమంగా అది ప్రజాస్వామ్య ప్రక్రియే. ప్రజల్లో ఎన్నికల ద్వారానే.. ఏదైనా తేల్చుకుందామంటారు. కానీ.. జీవీఎల్, రామ్‌మాధవ్ అలా కాదు కదా..! వారు ఎలా ఎదిగారు..? సర్పంచ్‌గా పోటీ చేసి.. ప్రజల ఓట్లు పొందగలరా..? ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము ఉందా..?. చంద్రబాబు కానీ.. జగన్ కానీ.. పవన్ కానీ.. నేరుగా ప్రజల నుంచి వస్తారు. కానీ.. వీరికి అలా వచ్చే దమ్ముందా..? దొడ్డి దారిన నేతలై.. ప్రజాభిమానం పొంది నేతలపై నోరు పారేసుకుంటే… అంతిమంగా అది వాళ్ల వినాశనానికే దారి తీస్తుంది…!
——-సుభాష్