ముందస్తు ఎన్నికల సన్నాహమో… ముందస్తుగా ఎన్నికల సన్నాహమో కానీ.. అమిత్ షా.. దేశాన్ని చుట్టబెట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయన ప్రధాన ఎజెండా.. బీజేపీ అనుబంధ హిందూత్వ సంఘాల నేతలతో సమావేశం. ఆ సమావేశంలో వివరాలు సాధారణంగా బయటకు రావు కానీ… ఒక్క విషయంలో మాత్రం లీకులు బయటకు వస్తున్నాయి. ఎన్నికల్లోగా రామమందిర నిర్మాణం ప్రారంభిస్తామనేది..ఆ లీకుల సారాంశం. నిన్న హైదరాబాద్కు వచ్చిన.. అమిత్ షా..ఆరెస్సెస్, వీహెచ్పీ నేతలతో కూడా ఇదే చెప్పారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ హిందూత్వ ఎజెండాను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉందన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ నేతల వ్యూహమో… మరో కారణమో కానీ.. కొద్ది రోజుల కిందట.. వీహెచ్పీ అగ్రనేతలు..ఢిల్లీలో సమావేశమయ్యారు. రామమందిరం అంశం సుప్రీంకోర్టు.. రెండు, మూడు నెలల్లో తేల్చకపోతే… తమ పని తాము చేసేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
అంతకు ముందే.. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ.. రామమందిరం అంశానికి పెద్దగా ప్రాధాన్యత లేదని ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత.. హిందూ సంస్థలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కానీ అంతా బీజేపీ నేతలు ఆడుతున్న డ్రామా అని విమర్శలు రావడంతో అప్పటికి సైలెంటయిపోయారు. నిజానికి లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ వస్తే… అయోధ్యలో రామాలయం నిర్మిస్తారమని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. పూర్తి మెజార్టీ వచ్చింది. అయినా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ పూర్తి మెజార్టీ అనే వాదన వినిపించారు. అక్కడ కూడా పూర్తి మెజార్టీ వచ్చింది. అటు కేంద్రంలోనూ.. ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ… బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. కానీ ఇంత వరకూ రామాలయం నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కోర్టుపై నెప నెట్టి.. అలా ఆలస్యం చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తూండటంతో.. తమ ట్రేడ్ మార్క్ రామాలయాన్ని మళ్లీ బయటకు తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని కోసం మాస్టర్ ప్లాన్ రెడీ అయిందన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాలన.. ఇతర విషయాలు.. ఎన్నికల్లో ఎజెండా కాకుండా ఉండాలంటే.. భావోద్వేగ అంశాలను వాడుకోవడమే మేలని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే అమిత్ షా.. ఆరెస్సెస్, వీహెచ్పీ వంటి బీజేపీ అనుబంధ హిందూసంఘాల నేతలతో.. విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. వీళ్ల ప్లానేంటో… ఒకటి, రెండు నెలల్లో బయటపడే అవకాశం ఉందంటున్నారు.